ముఖ్యమంత్రి ఆదేశాలతో పల్లె ప్రగతి( Palle Pragathi ), పట్టణ ప్రగతి ( Pattana Pragathi ) అమలు కోసం యంత్రాంగం సిద్ధమవుతోంది. జులై 1 నుంచి జరగనున్న కార్యక్రమాలను పక్కాగా చేపట్టేలా ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమీక్షలు జరిపి... గ్రామాలను ఎలా అభివృద్ధి చేయాలనే అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు.
పల్లెలు, పట్టణాల్లో పరిశుభ్ర వాతావరణం, మెరుగైన మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా మరో విడత పల్లె, పట్టణ ప్రగతికి రంగం సిద్ధమైంది. వరంగల్ గ్రామీణ జిల్లాకు సంబంధించిన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు( Minister Errabelli Dayakar Rao )తో పాటు స్ధానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పది రోజుల పాటు చేపట్టాల్సిన కార్యాచరణపై మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె, పట్టణ ప్రగతిని మొక్కుబడిగా కాకుండా.. చిత్తశుద్ధితో చేయాలని విజ్ఞప్తి చేశారు. పల్లెటూళ్లే మన భాగ్యసీమలని.. అవి బాగుంటేనే రాష్ట్రమూ బాగుంటుందన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి నిరంతర ప్రక్రియ అని గ్రామాలు, పట్టణాలు పూర్తిగా బాగుపడేవరకూ ఇది కొనసాగుతుందని ఎర్రబెల్లి దయాకరరావు స్పష్టం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి అన్ని పల్లెలను గంగదేవిపల్లి( Gangadevipalli ) లాంటి ఆదర్శగ్రామాలుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి విజయవంతానికి చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు.
కార్యక్రమంలో భాగంగా..
చెత్తా చెదారం తొలగించడం, అన్ని రహదార్లను శుభ్రపరచడం, గుంతలు పూడ్చివేయడం, పాడుపడిన నిర్మాణాలను తొలగించడం, మురుగు కాలువలు శుభ్రపరచడం, పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, మార్కెట్ స్థలాలు శుభ్రపరచుకోవడం, పిచ్చి మొక్కలు తొలగించడం, తడిచెత్త, పొడిచెత్త వేరుగా ఉంచేలా ఇంటివారికి అవగాహన కల్పించడం, దోమల నివారణకు, మురుగు నీరు తొలగింపు, నల్లాలకు సంబంధించి అన్ని లీకేజీలు సరిచేయుట, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు లేని చోట వెంటనే నిర్మించడం మొదలైనవి ఈ కార్యక్రమంలో చేపడతారు.