maize farmers problemes in Warangal : అకాల వర్షాల తిప్పలు ఎదుర్కొన్నా మక్కరైతుకు.. పంటను అమ్ముకునేందుకు మార్కెట్‌లోనూ కష్టాలు తప్పడం లేదు. హనుమకొండ జిల్లా పరకాల డివిజన్ వ్యాప్తంగా పత్తి పంట తీసేసిన తర్వాత ఎక్కువ మొత్తంలో రైతులు మొక్కజొన్నసాగు చేశారు. పంట దిగుబడి కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ అమ్ముకోవాలంటే ప్రభుత్వం పెట్టిన నిబంధనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై రోజులు గడుస్తున్నా.. కొనుగోలు కేంద్రాల నిర్వహణ లోపంతో కాంటాలు కావడం లేదు.
"మా దగ్గర రెండు ఎకరాలు పొలం ఉంది. కానీ యాప్లో మాత్రం కేవలం 26క్వింటాళ్లు చూపిస్తోంది. పంట ఎంత తీసుకొస్తే అంత తీసుకొవాలి. ప్రభుత్వం మాత్రం అలా కాకుండా కేవలం 26 క్వింటాళ్లు మాత్రమే తీసుకుంటాం అంటే ఎలా.. రైతులు దొంగతనం చేసి పంట తీసుకొని రావడం లేదు కదా".- మొక్కజొన్న రైతు
మిగతా పంట ఏం చేయాలి: రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురు చూడాల్సిన పరిస్థితి. పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తుందని ప్రభుత్వం గొప్పలు చెప్తుంది తప్ప ఆచరణలో మాత్రం ఇబ్బందులకు గురిచేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. ఎకరాకు 26 క్వింటాళ్లే కొనుగోలు చేస్తామని మిగతా పంట తమకు సంబంధం లేదని చెప్పడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరకాల డివిజన్ వ్యాప్తంగా మొక్కజొన్న పంట ఎకరాకు సుమారు 40 క్వింటాలుకు పైగా దిగుబడి వచ్చింది.