వరంగల్ రూరల్ జిల్లా పరకాల పురపాలిక సర్వ సభ్య సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యేను అనవసరంగా కొంత మంది నిందిస్తున్నారనీ, దానిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెరాస కౌన్సిలరు మాట్లాడటంతో సమావేశం ఉద్రిక్తతకి దారితీసింది.
పురపాలికల్లో ఇటీవల జరిగిన కంప్యూటర్ ఆపరేటర్ అభ్యర్థుల ఎంపికలో తెరాసకు చెందిన చదువు రాని కార్యకర్త్తలకు ఉద్యోగాలు ఇచ్చారనీ, చదువుకున్న ఇంజనీరింగ్ అభ్యర్థులను పక్కకు నెట్టారని భాజపా సభ్యులు ఆరోపించారు. దీంతో పురపాలికలో 18 మంది కౌన్సిలర్లం ఉన్నామనీ, కావాలంటే ఉద్యోగాలకు ఓటింగ్ నిర్వహించాలని తెరాస కౌన్సిలర్లు చెప్పారు. 3 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి అభ్యర్థుల సమయం వృథా చేసి ఇప్పుడు ఓటింగ్ ద్వారా ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం సిగ్గుచేటని భాజపా వాదనకు దిగింది.