Wanaparthy students stuck in ukraine : ఉక్రెయిన్‌లో పాలమూరు జిల్లాలకు చెందిన వైద్య విద్యార్థులు చిక్కుకోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళనలో మునిగిపోయారు. ఉన్నత చదువులకోసం ఉక్రెయిన్ దేశానికి వెళ్లిన వనపర్తి జిల్లాకు చెందిన విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారుని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి పట్టణానికి చెందిన మోడాల రచన, అరవింద్‌నాయుడు, పెద్దమందడి మండలం మునిగిళ్లకు చెందిన అభిలాష్‌రెడ్డి మెడిసిన్ అయిదో సంవత్సరం చదువుతున్నారు. వనపర్తికి చెందిన కృష్ణచైతన్య మూడో సంవత్సరం చదువుతున్నాడు. రెండు రోజుల కింద సొంతూరుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోగా ఉక్రెయిన్ గగనతలాన్ని మూసేశారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఫోన్లు చేసి తమను అక్కడి నుంచి రప్పించుకోవాలని చెప్పినట్లు తెలిపారు. పెబ్బేరుకు చెందిన వినోద్‌కుమార్ ఈనెల 27న స్వదేశానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోగా ఎయిర్‌బేస్ మూసివేయడంతో అక్కడే చిక్కుకుపోయారు. ఎప్పుడేమవుతుందో తెలియని పరిస్థితిలో బిక్కుబిక్కుమంటూ కాలం గడువుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి :ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఉమ్మడి పాలమూరు జిల్లా వాసులు
ఉక్రెయిన్‌లో ఎంబీబీస్ ఐదో సంవత్సరం చదువుతున్నాను. మా ప్రదేశంలో నిన్నటి నుంచి చాలా ఆందోళన పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడేమి జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. మమ్మల్ని సాధ్యమైనంత త్వరగా తరలించే ప్రయత్నం చేయాలి. నిన్న రాత్రి నుంచి ఈ ప్రాంతంలో కూడా దాడులు జరుగుతాయనే వార్తలు రావడంతో చాలా భయం వేస్తోంది. -రచన, ఎంబీబీఎస్ విద్యార్థిని
నేను ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చదువుతున్నాను. మేము ఉన్న ప్రదేశంలో ప్రస్తుతం ఎలాంటి దాడులు జరగలేదు. కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న భారత విద్యార్థులను తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. విద్యార్థుల తరలింపు ప్రక్రియ సాధ్యమైనంత వేగంగా జరగాలని కోరుతున్నాను. -అభిలాష్ రెడ్డి, ఎంబీబీఎస్ విద్యార్థి