ఎన్నో ఏళ్ల నుంచి పాలమూరు ప్రజలు పలు రైల్వే ప్రాజెక్టుల కోసం ఎదురుచూస్తున్నారు. గద్వాల - మాచర్ల, వికారాబాద్ - కృష్ణా, జడ్చర్ల - నంద్యాల రైల్వే లైన్లను దశాబ్దాలుగా కోరుతున్నారు. వెనుకబడిన నాగర్‌కర్నూలు, నారాయణపేట జిల్లాలు అభివృద్ధి సాధించాలంటే ఈ రైల్వే లైన్లు ఎంతో అవసరం. ఈ ప్రాజెక్టులపై ఎలాంటి హామీ లభించకపోవడంతో దాదాపుగా వాటికి కేటాయింపులు లేనట్లే.
సైనిక్ పాఠశాలపై నీలినీడలు
నారాయణపేటలో సైనిక్ పాఠశాల కోసం స్థలం కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు అనుమతులు రాలేదు. ఈ బడ్జెట్‌లోనైనా సైనిక్ పాఠశాల ప్రస్తావన ఉంటుందని అందరూ భావించారు. దీని ప్రస్తావన లేకపోవడంతో సైనిక్ పాఠశాల ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. కేంద్రియ విద్యాలయాలు, నవోదయ పాఠశాలల ఊసేలేదు. ఈ ఏడాది పాలమూరుకు ఎలాంటి విద్యాలయాలు రానట్లే.
పాలమూరుకు నిరాశే
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా లేదా ప్రత్యేక నిధులు కావాలని ప్రభుత్వం కోరుతోంది. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో 12,30,000 ఎకరాలకు సాగునీరు అందించే ఎత్తిపోతల పథకం నిధులు లేక నత్తనడకన సాగుతోంది. కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయిస్తే పనులు పరుగులు పెట్టే అవకాశం ఉండేది. ఈసారి ‘పాలమూరుకు’ నిరాశే ఎదురైంది.
అసంఘటిత కార్మికులకు ఆసరా
ప్రధానమంత్రి శ్రమయోగి బంధన్ యోజన కింద 60 ఏళ్లు నిండిన అసంఘటిత కార్మికులకు రూ. 3వేలు పింఛను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని పూర్తిస్థాయిలో అమలుచేస్తున్నట్లు ఈ బడ్జెట్‌లో ప్రకటించింది. ప్రతినెలా రూ. 100 చెల్లిస్తే ప్రభుత్వం అంతే మొత్తం చెల్లిస్తుంది. 60 ఏళ్లు నిండిన తర్వాత కార్మికులకు పింఛను అందుతుంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 17.89 లక్షల మంది అసంఘటిత కార్మికులు ఉన్నారని అంచనా. 3,30,076 మంది భవన నిర్మాణ కార్మికులు, 25వేల మంది బీడీ కార్మికులు, 12,500 మంది చేనేత కార్మికులు, 9 లక్షల వ్యవసాయ కూలీలు, ఇతర రంగాల్లో 5.20 లక్షల మంది కార్మికులు ఉన్నారు.
చిల్లర వర్తకులకు చేయూత
సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాళ్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిల్లర వర్తకులకు ఊరట లభించింది. ప్రధానమంత్రి కర్మయోగి మాన్‌ధన్ యోజన ద్వారా చిల్లర వర్తకులకు కేంద్రం పింఛను సౌకర్యం తీసుకురానుంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 50వేల మంది చిల్లర వర్తకులు ఉన్నారు. అందులో వార్షిక టోర్నవర్ 1.5 కోట్లలోపు ఉన్న వాళ్లందరికీ పింఛను సౌకర్యం సమకూరనుంది. దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలోని సుమారు 35వేల మందికి పైగా చిల్లర వర్తకులు దీనికి అర్హత సాధించే అవకాశం ఉంది.
ఇక మహిళలకూ ముద్ర రుణాలు
తొలి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ అతివలకు పెద్దపీట వేశారు. స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులైన మహిళలకు ముద్ర రుణాలను అందించనున్నట్లు ప్రకటించారు. మహిళాల్లో వ్యాపార దృక్పథాన్ని పెంపొందించడానికి, స్వయంఉపాధితో ఆర్థిక సాధికారత సాధించేందుకు ముద్ర రుణంగా రూ. లక్ష అందించనున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 58వేల స్వయం సహాయక బృందాలు ఉన్నాయి. 6,30,000 మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఈ బృందాల్లో సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరికి జన్‌ధన్ ఖాతాతోపాటు రూ. 5000 ఓవర్ డ్రాఫ్ట్(ఓడీ) సౌలభ్యం దక్కనుంది. వీరు తమ అవసరాలకు ఎప్పుడంటే అప్పుడు ఓడీ కింద రూ. 5వేల వరకు ఏటీఎం ద్వారా డ్రా చేసుకోవచ్చు.
కట్టెల పొయ్యి కష్టాలు దూరం
ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద మహిళలకు మరో 8 కోట్ల ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2018 ఏప్రిల్ 20న కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా మహిళలకు ఉచితంగా ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్లు అందించనుంది. ఉమ్మడి జిల్లాలో 8,04,070 కుటుంబాలు ఉన్నాయి. అందులో 7.10 లక్షల కుటుంబాలకు ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. మరో 90వేల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు అందాల్సి ఉంది. పాలమూరులోని గూడేలు, తండాలు, గ్రామాల్లో మహిళలు ఇప్పటికీ కట్టెలపొయ్యిపైనే వంట చేస్తున్నారు. వీరందరి కష్టాలు దూరం కానున్నాయి.