తెలంగాణ

telangana

ETV Bharat / state

అవిశ్రాంత సేవకులు... ఆరోగ్య రక్షకులు

ప్రాణాపాయ స్థితిలో ఎవరైనా ఆసుపత్రికి చేరితే వెంటనే స్పందించేది నర్సులు. వారికి బాధనుంచి ఉపశమనం కలిగించడంలో వారే ముందుంటారు. తరువాత వైద్యులు పరీక్షించి వ్యాధి నిర్ధరిస్తారు.మొత్తం రోగులకు అన్ని రకాల వైద్య సేవలు చేసేది మాత్రం నర్సులేననడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుత కరోనా వైరస్‌ నియంత్రణ, బాధితుల సేవలో నర్సుల పాత్ర మాటల్లో చెప్పలేనిది.

special story on vikarabad district nurses services
special story on vikarabad district nurses services

By

Published : May 12, 2020, 2:00 PM IST

కరోనా చికిత్సలు నిర్వహించిన వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది సేవలకు గుర్తింపుగా ఆస్పత్రులపై ఆర్మీ ఆధ్వర్యంలో హెలికాప్టర్‌ ద్వారా పూలవర్షం కురిపించి వారి సేవలను ప్రశంసించారు. నర్సుల కృషికి గుర్తింపుగా ప్రతి సంవత్సరం మే 12ను అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ‘ది వాయిస్‌ టు లీడ్‌. హెల్త్‌ ఈజ్‌ హ్యూమన్‌ రైట్‌’ పేరిట నిర్వహిస్తున్నారు. ఆరోగ్యం పౌరుల హక్కుగా నినదిస్తున్న తరుణంలో నర్సుల పాత్రపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో 280 మంది నర్సులు...

వికారాబాద్​ జిల్లాలో పరిగి, తాండూరు, కొడంగల్‌, వికారాబాద్‌ నియోజకవర్గాలుండగా... మొత్తం 280 మంది నర్సులు , 365 మంది ఆశా కార్యకర్తలు విధులు నిర్వహిస్తున్నారు. ఏ ఆరోగ్య సమస్య తలెత్తినా ఎవరైనా ఆస్పత్రి గడప తొక్కాల్సిందే. వెళ్లగానే ధవళ వస్త్రాల్లో కనిపించే నర్సులే మొదట ప్రాథమిక వైద్యం ఆరంభిస్తారు. అయితే ఇటీవలి కాలంలో నర్సులపై పనిభారం పెరుగుతోంది. జనాభా పెరుగుతున్నా ఆస్పత్రుల స్థాయి, సిబ్బంది సంఖ్య రెట్టింపు కాక పోవడమే ఇందుకు కారణం.

పరీక్ష రాయగానే ఉద్యోగం...

ఇంటర్‌ తరువాత బీఎస్సీ నర్సింగ్‌ నాలుగున్నరేళ్లు, జనరల్‌ నర్సింగ్‌ మూడున్నరేళ్లు. ఈ రెండు కోర్సులు అభ్యసించిన వారు చివరి సంవత్సరం పరీక్షలు రాయగానే ఉద్యోగం తలుపు తడుతుంది. ఇంజినీర్లకంటే త్వరగా ఉద్యోగం పొందుతున్నది నర్సింగ్‌ పూర్తి చేసిన వారే.

జిల్లా, మండల, పట్టణ స్థాయిలో ఏ చిన్న నర్సింగ్‌ హోం పెట్టినా ఉపాధి పొందొచ్చు. వికారాబాద్‌ జిల్లాలో సుమారుగా 2 వేల మంది నర్సింగ్‌ వృత్తిపై ఆధారపడి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో జీవనోపాధి పొందుతున్నారు. ఏటా జిల్లాలో 315 మంది కోర్సు పూర్తి చేస్తున్నారు. ఏఎన్‌ఎం కోర్సును సుమారు 200 మంది అభ్యసిస్తున్నారు.

పురుషులకూ అవకాశాలు...

ఇది వరకు నర్సింగ్‌ వృత్తి అంటే మహిళలే గుర్తుకొచ్చేవారు. దశాబ్దం కిందట నర్సింగ్‌ కౌన్సిల్‌ తీసుకున్న నిర్ణయంతో పురుషులు సైతం కోర్సు అభ్యసించడానికి అవకాశం కలిగింది.

గ్రామీణ ఆరోగ్యంలో ఏఎన్‌ఎంలు...

గ్రామీణ ఆరోగ్య వ్యవస్థను పటిష్ఠం చేయడంలో ఏఎన్‌ఎంల పాత్ర కీలకం. ప్రతి ఐదు వేల జనాభాకో ఏఎన్‌ఎంను ప్రభుత్వం నియమిస్తోంది. కాలానుగుణ వ్యాధుల నియంత్రణలోనూ వీరి సేవలే కీలకం. మాతాశిశు మరణాలు తగ్గుముఖం పట్టడానికి ప్రభుత్వం నిర్ధేశించిన వైద్య పరీక్షల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయడం వల్ల శిశుమరణాలకు కారణమైన ప్రాణాంతక ధనుర్వాతం, కోరింతదగ్గు, మశూచి, క్షయ వంటి వ్యాధులు తగ్గు ముఖం పట్టాయి. కీటక జనిత వ్యాధులపై జాగృతం చేస్తున్నారు.

కేటాయింపు ఇలా...

ఆస్పత్రి స్థాయి, పడకల సంఖ్యను పరిగణలోకి తీసుకుని నర్సులను కేటాయిస్తారు. ఆ తరువాత రద్దీ ఆధారంగా సిబ్బంది సేవలను వినియోగించుకుంటారు.

గర్వంగా అనిపిస్తుంది...

ఏఎన్‌ఎంగా 30 ఏళ్ల సర్వీసు పూర్తయింది. ఇన్నేళ్లలో ఎక్కువగా ప్రసూతి సేవలే అందించా. ప్రాణాలు నిలిపిన రోజెంతో సంతృప్తిగాను, గర్వంగానూ అనిపిస్తుంది. మేం ఉద్యోగం నుంచి రిటైర్‌ అయినా రోగులకు సేవ చేయవచ్చు. ప్రభుత్వం ఆసుపత్రుల్లో నర్సులకు సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది.

- అనంతమ్మ, నర్సు, వికారాబాద్‌

ABOUT THE AUTHOR

...view details