నైరుతి రుతుపవనాల ఆగమనంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రహదారులపై నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే వికారాబాద్ జిల్లాలో ఓ పెళ్లి బృందానికి పెనుప్రమాదం తప్పింది. హైదరాబాద్లోని బోరబండకు చెందిన పెళ్లి బృందం.. కోటపల్లి మండలం బర్వాద్ గ్రామానికి పెళ్లికి వచ్చింది.
వివాహ అనంతరం తిరిగి ప్రయాణంలో రాత్రి సుమారు 11 గంటల సమయంలో కేసారం రైల్వే బ్రిడ్జి కింద బస్సు వరద నీటిలో చిక్కుకుంది. ముందుకు కదలలేక అక్కడే ఇరుక్కుపోయింది. చూస్తుండగానే బస్సులో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అప్రమత్తమైన పెళ్లి బృందం.. హుటాహుటిన బస్సులో నుంచి కిందకు దిగడంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. తెల్లవారే సరికి బస్సు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. గమనించిన రైల్వే సిబ్బంది, స్థానికులు మోటార్ల ద్వారా నీటిని తోడేసి.. బస్సును బయటకు తీశారు.
మరోవైపు ఈ రైల్వే వంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నా.. అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదని మండిపడుతున్నారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసి.. తమకు ఉపశమనం కల్పించాలని కోరుతున్నారు.