కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడేళ్లుగా స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలు నిర్వహిస్తుంది. ఏటా వికారాబాద్, తాండూరు పట్టణాలు పోటీ పడుతున్నాయి. పరిగి, కొడంగల్ మున్సిపాల్టీలు గతేడాది కొత్తగా ఏర్పడటం వల్ల పోటీలో పాల్గొన లేదు. 2020 ర్యాంకులను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే.
పకడ్బందీగా అమలు...
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో వికారాబాద్ పురపాలక సంఘం అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, కార్మికులకు శ్రమకు కొంత వరకు ఫలితం దక్కింది. పట్టణంలో 12 వేల పైగా గృహాలు ఉండగా 13వేల చెత్త బుట్టలు, మరో 13 వేల సంచులను తెప్పించి పంపిణీ చేశారు. ప్రధాన కూడళ్లలో కుండీలను ఏర్పాటు చేయించారు. పారిశుద్ధ్యంతో పాటు పచ్చదనం పెంచేందుకు కృషి చేస్తున్నారు. పట్టణంలోని 25 వార్డులో సేంద్రియ ఎరువు తయారు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ నిషేధాన్ని క్చతంగా అమలు చేస్తున్నారు.తరచుగా పురపాలక సంఘం అధికారులు దుకాణాలను తనిఖీ చేసి ప్లాస్టిక్ సంచులను అమ్మితే జరిమానాలు విధిస్తున్నారు. జనాభాకు అనుగుణంగా శౌచాలయాలను నిర్మించి వినియోగంలోకి తెచ్చారు. దీంతో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో గతంలో పోలిస్తే కాస్త మెరుగైన ర్యాంకు సాధించింది.
మరింత కృషి చేస్తాం
గత సంవత్సరం కన్నా ఈసారి ర్యాంకులో పురోగతి కనిపించింది. ఇంది సంతోషించాల్సిన విషయమే. మేం రెండు, మూడు ర్యాంకులు రావచ్చని ఆశించాం. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచటానికి మరింత కృషి చేస్తాం. ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం
- సి.మంజుల, అధ్యక్షురాలు, పురపాలక సంఘం, వికారాబాద్
అందరి సహకారంతో..
ఈసారి మంచి ర్యాంకు దక్కుతుందని ఆశించాం. పాలక వర్గం, పట్టణ వ్యాపారస్తులు, సిబ్బంది చక్కగా సహకరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మంచి ర్యాంకు సాధించేందుకు వివిధ ప్రణాళికలు అమలు చేశాం. ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. పట్టణ ప్రజలకు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించాం. వికారాబాద్ పురపాలికలో విలీనమైన గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యంపై దృష్టి సారించాం. బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా తీర్చిదిద్దాం. ఇకముందు మరింత పట్టుదలతో పనిచేస్తాం.
- బోగేశ్వర్లు, కమిషనర్, పురపాలక సంఘం, వికారాబాద్
పల్లె పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ
పల్లెల పరిశుభ్రతపై అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉండటం వల్ల జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఇప్పటికే చెత్తను తొలగించేందుకు ప్రతి పంచాయతీకి ట్రాక్టర్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. వీటి ద్వారా గ్రామాల్లో ఉన్న చెత్తను తొలగించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. వీధుల్లో మురుగు కాల్వలను, పరిసరాలను పారిశుద్ధ్య సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. ప్రధానంగా తాగేనీరు పరిశుభ్రంగా ఉంచేందుకు ట్యాంకులను శుభ్రం చేయిస్తున్నారు. ఇంటికి వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. దోమలు వృద్ధి చెందకుండా యంత్రాలతో మందును పిచికారీ చేయిస్తున్నారు. పశువుల తొట్టీలలో పరిశుభ్రమైన నీరు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజలకు రోగాల బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తున్నాం. పరిసరాల్లో దోమలు పెరగకుండా ఉండేందుకు మందు పిచికారీ చేయిస్తున్నాం.