ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కూలీలను స్వస్థలాలకు పంపించాలని ఇటీవల ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలు సడలించడం వల్ల కూలీలు ఎక్కడికక్కడ బయటికి వచ్చారు. తమ స్వస్థలాలకు వెళ్లడానికి బయలుదేరారు. ఇదే క్రమంలో వికారాబాద్ జిల్లా తాండూరులో ఆదివారం కొన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయి. బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వలసకూలీలు వందల సంఖ్యలో రోడ్డెక్కారు. తాండూరు ప్రాంతంలో ఉన్న నాపరాతి పాలిష్ యూనిట్లలో పని చేస్తున్న కూలీలతో పాటు లారీలపై పనిచేసే కూలీలు ఉపాధి లేక, పస్తులు ఉండలేక సొంతూళ్లకు వెళ్లడానికి ఉపక్రమించారు. పెద్ద ఎత్తున కూలీలు బయటకు రావటంతో... విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు వారిని నిలువరించారు.
స్వస్థలాలకు వెళ్లేందుకు రోడ్డెక్కిన వలసకూలీలు - corona virus
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న లాక్డౌన్ వల్ల వలస కూలీలు అవస్థలు పడుతున్నారు. గత నెలన్నర రోజులుగా వారు పని లేక ఇబ్బందులు పడుతున్నారు. స్వస్థలాలకు వెళ్లేందుకు పయనమయ్యారు.
పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో వారిని ఉంచారు. ఇక్కడే ఉండాలని వారికి పలు విధాలుగా అధికారులు నచ్చజెప్పారు అయినప్పటికీ వారు ససేమిరా అన్నారు. అధికారులు ఏర్పాటు చేసిన భోజనం కూడా చేయడానికి కూలీలు నిరాకరించారు. తమను సొంత గ్రామాలకు పంపించాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో అధికారులు కూలీలు పనిచేసే పాలిషింగ్ యూనిట్లు, లారీల యజమానులను పిలిపించి మాట్లాడారు. కూలీలు వెళ్లడానికి వాహనాలు ఏర్పాటు చేయాలని అధికారులు వారికి సూచించారు. ఆ యజమానులు కొంత సమయం ఇవ్వాలని అనడం వల్ల అధికారులు ఎటు తేల్చుకోలేని సందిగ్ధంలో ఉన్నారు.
ఇవీ చూడండి: స్వస్థలాలకు వెళ్లే వారి కోసం డిజిటల్ పాసులు : డీజీపీ మహేందర్ రెడ్డి