ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థగానే పుట్టిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. భేషాజాలకు, పట్టుదలకు పోకుండా మానవీయ కోణంలో కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని సూచించారు. ఆర్టీసీపై ఉమ్మడి రాష్ట్రంలో రాని నష్టం తెలంగాణలో ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. నిజాం హయాంలో, ఉమ్మడి ఏపీలోనూ ఆర్టీసీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉందని గుర్తుచేశారు. టీఎస్ఆర్టీసీని సీఎం కేసీఆర్ వంద శాతం ప్రైవేటీకరిస్తామని చెప్పడం మంచి పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. సమ్మె నోటీసు ఇచ్చిన నాడే స్పందించి... చర్చలు జరిపి ఉంటే ఇప్పుడు ఇన్ని కార్మిక ప్రాణాలు పోయేవి కావని ఆందోళన వ్యక్తం చేశారు. లోటు బడ్జెట్లో ఉన్న పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రద్రేశ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిందని గుర్తు చేశారు.
'ఆర్టీసీకి అప్పుడు రాని నష్టం.. ఇప్పుడెలా వస్తుంది'
ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ కక్ష సాధింపు చర్యలు మాని సమస్యలు పరిష్కరించాలని మందకృష్ణ మాదిగ సూచించారు. కార్మికుల భవిష్యత్‌పై మానవతా దృక్పథంతో ఆలోచించాలని వికారాబాద్ జిల్లాలో అన్నారు.
ఆర్టీసీ కార్మికులపై మానవతా దృక్పథంతో ఆలోచించాలి : మందకృష్ణ