వికారాబాద్ జిల్లా దారుర్ మండలంలోని రైతులు.. పొలాల వద్దే గుడిసెలు వేసుకుని కాపలా కాస్తున్నారు. పంట దొంగల భయంతోనే కదా అనుకొంటే మీరు పొరబడినట్టే! పశుపక్ష్యాదులే అసలు కారణమంటూ.. పండించిన పంటను వాటి బారి నుంచి దక్కించుకోవాడానికి తాము చేయని ప్రయత్నం లేదని వారు వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కోతుల కారణంగా.. పొలాల్లో ఉంటున్నారు!
అహర్నిషలు శ్రమించి పంటలు పండించే అన్నదాతల సమస్యలు అన్ని ఇన్ని కావు. అప్పుల బాధలు ఓ వైపు, వాతవరణ ఇబ్బందులు మరోవైపు. చచ్చి బతికి పండించిన పంట.. చేతికందే సమయానికి పశుపక్ష్యాదుల బెడద రైతులను తీవ్రంగా వేధిస్తోంది.
మండలంలోని క్యాసారం, నాగారం, మొమింకలన్ తదితర గ్రామాల్లో కోతుల బెడద అధికంగా ఉందంటూ రైతులు వాపోతున్నారు. కోతులు, నెమళ్లు, అడవిపందులు ఇతర పశుపక్ష్యాదులు.. చేతికందిన పంటపై పడి వాటిని నాశనం చేస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను వాటి బారి నుంచి రక్షించుకునేందుకు.. పొలాల్లోనే గుడిసెలు వేసుకుని ఉంటున్నామని పేర్కొన్నారు. ఇనుప డబ్బాలతో చప్పుళ్లు చేస్తూ.. వాటిని అదరగొట్టే ప్రయత్నం చేసిన లాభముండటం లేదని విలపిస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి:పంటను కాపాడుకునేందుకు అన్నదాతల అగచాట్లు