సూర్యాపేట జిల్లా యర్కారం గ్రామం వరుస హత్యలతో దద్దరిల్లుతోంది. హత్యా రాజకీయలతో రికార్డుల్లో ఉన్న యర్కారం మరోసారి పార్టీల మధ్య ఉన్న కక్ష్యలతో రక్తం చిందించింది. సహకార సంఘ ఎన్నికల వేళ తమ కార్యకర్తలను ప్రలోభ పెడుతున్నారన్న కారణంతో మూడు రోజుల కిందట సూర్యాపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పడిన ఘర్షణ హత్యకు దారితీసింది. గ్రామ మాజీ సర్పంచ్, తెరాస నాయకుడు ఒంటెద్దు వెంకన్న దారుణ హత్యకు గురయ్యారు.
వెంటపడి మరీ... చంపారు...
గ్రామంలో పాత కక్షలు ఉన్నప్పటికీ... సహకార సంఘాల ఎన్నికల దృష్ట్యా ప్రజలను ప్రలోభ పెడుతున్నారన్న కారణంతో ఇరుపార్టీల కార్యకర్తలు గొడవకు దిగారు. అర్ధరాత్రి సమయంలో ఓటర్లను కలిసి మాట్లాడుతుండగా... కాంగ్రెస్ కార్యకర్తలు వెంకన్నను మారణాయుధాలతో తరిమారు. వారి నుంచి తప్పించుకునేందుకు గ్రామ శివారులో ఉన్న ఆవుదొడ్డి ఎల్లయ్య ఇంట్లో దాక్కున్నారు. ఇంటిపై దాడి చేసిన నిందితులు ఇంట్లో ఉన్న వారిని బయటకు పంపించి... వెంకన్న తలపై బండరాళ్లతో మోది హత్య చేసినట్లు డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు.
అదే ఇంట్లో బస్తాల పక్కన దాక్కోవటం వల్ల తాము ప్రాణాలతో బయటపడినట్లు ప్రత్యక్షసాక్షి మధు చెబుతున్నారు. గ్రామంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒంటెద్దు వెంకన్నతో కలిసి ఇప్పటి వరకు యర్కారంలో ఐదుగురు హత్యకు గురయ్యారు. ఒకప్పుడు కాంగ్రెస్, తెదేపా మధ్య జరిగిన ఘర్షణ ఇప్పుడు తెరాస, కాంగ్రెస్ మధ్య జరుగుతోంది.
రాజకీయ హత్య: సహకార ఎన్నికల వేళ రక్తం చిందిన యర్కారం