తెలంగాణ

telangana

ETV Bharat / state

జాతరమ్మ జాతర... పెద్దగట్టు జాతర!

ఆ జాతరను చూసేందుకు రెండుకళ్లూ చాలవంటారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర లేని సంవత్సరంలో ఈ వేడుకను నిర్వహించడం తెలంగాణ ప్రాంతంలో ఓ సంప్రదాయంగా వస్తోంది. అదే పెద్దగట్టు లింగమంతుల జాతర. నల్గొండలోని సూర్యాపేటలో ఎంతో వైభవంగా జరిగే ఈ జాతరను చూసేందుకు భక్తులు లక్షల్లో తరలివస్తారని అంటారు.

peddagattu lingamanthula jathara started
జాతరమ్మ జాతర... పెద్దగట్టు జాతర!

By

Published : Feb 28, 2021, 10:10 AM IST

తెలంగాణ ప్రాంతంలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తరువాత ఎంతో ప్రాధాన్యమున్న మరో వేడుకే పెద్దగట్టు లింగమంతుల జాతర. మేడారం సమ్మక్క సారలమ్మ తరహాలోనే ఇక్కడా రెండేళ్లకోసారి ఉత్సవాలు జరుగుతాయి. సూర్యాపేటలోని దురాజ్‌పల్లి గుట్టపైకి దేవుళ్ల విగ్రహాలున్న దేవరపెట్టెను పల్లకిలో తీసుకురావడం, పొట్టేళ్లను బలి ఇవ్వడం, బోనం సమర్పించడం... ఇలా అత్యంత వైభవంగా జరిగే పెద్దగట్టు జాతర ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 4 వరకూ అయిదు రోజులపాటు జరగనుంది. యాదవుల ఇలవేల్పుగా భావించే లింగమంతుల స్వామిని కొలిచి, శివుడి సోదరిగా-కుమార్తెగా భావించే చౌడమ్మ తల్లికి మాంసాహారాన్ని నివేదించడమే ఈ జాతర విశిష్టత. అసలిది ఎలా ప్రారంభమైందంటే...

విగ్రహాలు వెలికితీసి... పూజలు

దురాజ్‌పల్లి ప్రాంతానికి శివుడు రావడంవల్లే ఈ జాతర ప్రారంభమయ్యిందని అంటారు. ఈ జాతరను గొర్ల, మున్నా, మెంతబోయిన వంశస్థులు నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం... అమృత మథనం సమయంలో దేవతలూ, రాక్షసులూ పోటీ పడినప్పుడు... దేవతలపైన దాడికి దిగిన అసురుల్ని సంహరించేందుకు శివుడు సిద్ధమయ్యాడట. రాక్షసుల్ని వధిస్తున్నప్పుడు భూమిపైన పడే ప్రతి నెత్తుటి చుక్క నుంచీ మరో అసురుడు ఊపిరిపోసుకునేవాడట. అలా రాక్షసుల్ని వధిస్తూ వచ్చిన శివుడు చివరకు పెద్దగట్టుకు చేరుకుని అలసిపోయాడట. ఆ సమయంలో శివుడి చెమట చుక్క పెద్ద గట్టుపైన పడటంతో చౌడమ్మ దేవి జన్మిం చిందట. ఆ దేవి శివుడు సంహరించే రాక్షసుల రక్తం కిందపడకుండా తాను తాగేస్తానని హామీ ఇవ్వడంతో అసుర సంహారం పూర్తి అయ్యిందట. అయితే శివుడు తిరిగి వెళ్లిపోయేవేళ... చౌడమ్మ ఇకపైన తన ఆకలి తీరే మార్గాన్ని చూపించమని పరమేశ్వరుడిని కోరిందట.

భక్తులు తన పక్కనే కొలువైన చౌడమ్మకు రక్త, మాంసాహారాన్ని నివేదించే వరాన్ని శివుడు ప్రసాదించాడట. అలా పెద్దగట్టులో జంతు బలి ప్రారంభమయ్యిందని అంటారు. ఈ గుడికి సంబంధించి మరో కథా ప్రచారంలో ఉంది. శివుడు, చౌడమ్మ కొలువైన ఆలయానికి ఓ సారి నిండుగర్భిణి వచ్చి అదుపుతప్పి కిందపడి చనిపోయిందట. దాంతో ఆమె భర్త గుట్టపైనున్న విగ్రహాలను బావిలో పడేశాడట. ఆ సమయంలో పశువుల్ని మేపేందుకు పెద్దగట్టుకు వెళ్లిన గొర్ల, మెంతెబోయిన వంశస్థులు అలసిపోయి పడుకున్నప్పుడు వాళ్లకు స్వామి కలలో కనిపించి బావిలో ఉన్న విగ్రహాలను బయటకు తీయమనీ.. వాటిని భక్తులు దర్శించుకునేలా దురాజ్‌పల్లిగుట్టపైన ప్రతిష్ఠించమనీ చెప్పాడట. అలా విగ్రహాల్ని బయటకు తీసిన యాదవ వంశస్థులు వాటిని దురాజ్‌పల్లి గుట్టపైన ఉంచి పూజలు మొదలుపెట్టారనీ.. అప్పటినుంచే జాతర మొదలయ్యిందనీ అంటారు.

మాఘపౌర్ణమికి శ్రీకారం

దురాజ్‌పల్లి గుట్టపైన జరిగే ఈ జాతరకు మాఘ పౌర్ణమి నాడు శ్రీకారం చూడతారు. అంతకు పదిహేనురోజులముందు దిష్టి పోసే కార్యక్రమం నిర్వహిస్తారు. అందులో భాగంగా మహబూబాబాద్‌ జిల్లా చీకటాయపాలెం నుంచి వచ్చే 36 విగ్రహాలున్న దేవరపెట్టెను సూర్యాపేట సమీపంలోని కేసారం తీసుకొస్తారు ఆ పెట్టెను కేసారం నుంచి దురాజ్‌పల్లి గుట్టకు తరలించడంతో వేడుక ప్రారంభమవుతుంది. గొర్ల, మెంతెబోయిన, మున్నా వంశస్థులు పసుపు-కుంకుమ, పాలు-నెయ్యి, పిల్ల-తల్లి పొట్టేళ్లను వెంటబెట్టుకుని ఆ దేవరపెట్టెను మోసుకుంటూ కాలినడకన గుట్టకు చేరి, బోనాలను సమర్పించి, కొత్త కుండల్లో తెచ్చిన బియ్యాన్ని వండి నివేదిస్తారు. తరువాత ఈ వంశీకులు మూడు గొర్రెల్ని బలి ఇచ్చి అమ్మవారికి అన్నంతోపాటూ మాంసాన్ని వండి నివేదిస్తారు. నెయ్యితోకలిపిన అన్నం, మాంసాన్ని కేవలం మెంతెబోయిన వంశానికి చెందిన అయిదుగురు పెద్దమనుషులు మాత్రమే తినాల్సి ఉంటుంది. అలాగే జంతుబలి అయ్యాక మున్నా వంశస్థుల గొర్రె నెత్తుటి చుక్కను పాలల్లో కలిపి తరువాత ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇది స్వీకరించేవారు బయటి ప్రాంతాల్లో మద్యం, మాంసం ముట్టుకోకూడదని ఆచారం. కులదైవంగా, ఇలవేల్పుగా భావించే తమ స్వామి పశువులను చల్లగా చూస్తాడని నమ్ముతారు యాదవులు. మార్చి మూడున కేసారానికి దేవరపెట్టెను తరలించిన మర్నాడు ఈ జాతర ముగుస్తుంది.

ఎలా చేరుకోవచ్చు..

నల్గొండ జిల్లా సూర్యాపేటకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో జరిగే ఈ జాతర ప్రదేశానికి హైదరాబాద్‌, విజయవాడ, వరంగల్‌తోపాటూ ఇతర ప్రాంతాల నుంచీ ప్రత్యేక బస్సులుంటాయి.

ABOUT THE AUTHOR

...view details