కరోనా వెలుగుచూసిన తొలినాళ్లలో.. భారతదేశంలోకి ఈ వైరస్ వస్తే అడ్డుకోలేరని, అక్కడ ప్రజలు కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించరని.. ఇతర దేశాలు అపోహలు పడ్డాయని.. కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. కానీ ప్రధాని నేతృత్వంలో కఠిన ఆంక్షలు విధించి కరోనాను కట్టడిచేసినట్లు స్పష్టంచేశారు. జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా.. సూర్యాపేట జిల్లా కోదాడలో ఏర్పాటుచేసిన సభలో కిషన్రెడ్డి పాల్గొన్నారు.
గతంలో టీకాలు, ఇతర వైద్య పరికరాలు ఇతర దేశాల నుంచి వచ్చేవని.. కానీ ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక... ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా కట్టడికి స్వదేశంగా టీకా తయారైనట్లు తెలిపారు. ప్రపంచంలో తొలుత టీకాలు తయారుచేసిన కొన్ని దేశాల్లో మన దేశం కూడా ఉందన్నారు. స్వయంగా ప్రధానే.. కంపెనీలకు వెళ్లి సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు.
కరోనా విజృంభణ దృష్ట్యా దేశంలోని సుమారు 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం అందిస్తున్నట్లు చెప్పారు. అనేక రకాల సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నట్లు చెప్పారు. రైతులకు ఎన్నో ప్రయోజనాలు సమకూర్చినట్లు చెప్పారు. యూరియా కొరత లేకుండా చూసినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్ ఇంకా కొన్ని రోజులు ముఖ్యమంత్రిగా కొనసాగితే.. రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి వస్తుందని కిషన్రెడ్డి విమర్శించారు. కుర్చీ, కుమారుడు, కుటుంబం కోసం ఏమైనా చేసేందుకు తెలంగాణ ఏమైనా పర్వాలేదని.. కేసీఆర్ అనుకుంటున్నారని కిషన్రెడ్డి ఆరోపించారు.