సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీ సమావేశంలో కౌన్సిలర్ల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. మున్సిపాలిటీ సమావేశం ఎజెండాను కౌన్సిలర్లకు పంపకుండా తయారు చేయడమేంటని కౌన్సిలర్లు ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ ఆర్ఆర్డీఓ కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు రూ. 50 లక్షలు ఎలా ఖర్చయ్యారని ప్రశ్నించారు. ఎవరిని అడిగి డబ్బులు డ్రా చేశారని ప్రశ్నించారు. హుజూర్నగర్ పట్టణంలో ప్రభుత్వ భూమి 70 వేల గజాల భూమి ఉన్నదని.. దాంట్లో 13వేల గజాల భూమి ఆక్రమణకు గురైందని పేర్కొన్నారు. ఆ భూమిని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని కౌన్సిలర్లు అన్నారు. అక్రమంగా నిర్మించిన లేఅవుట్‌ను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూమి చుట్టూ బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి హాజరయ్యారు.
ఎజెండాను పాటించాలి
వాదోపవాదాల అనంతరం ఉత్తమ్ సమావేశంలో ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే హుజూర్నగర్ మున్సిపాలిటీ ఏర్పడిందని, తద్వారానే పట్టణం అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. మున్సిపాలిటీలో నిధులు ఖర్చు చేయాలంటే ఎజెండా ప్రకారం చేయాలని సూచించారు. పట్టణ అభివృద్ధి విషయంలో తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అక్రమ లే అవుట్ గురించి కలెక్టర్ మాట్లాడానని మరోసారి చర్చిస్తానని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కోదాడ, హుజూర్‌నగర్‌లలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కాలేదని వెల్లడించారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అందరిమీద ఉందని సూచించారు. భూములు దుర్వినియోగం అవుతుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ విషయంపై ఎక్కడైనా మాట్లాడతానని అన్నారు.
అనంతరం ఉత్తమ్.. మీడియాతో మాట్లాడారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్‌దే అని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.