చైనా- భారత్ సరిహద్దులోని ఈశాన్య లద్దాఖ్‌లోని గాల్వాన్ లోయలో వీరమరణం పొందిన సూర్యాపేట వాసి కర్నల్ సంతోష్‌బాబు చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. 1993 నుంచి విజయనగరంలోని కోరుకొండ సైనిక పాఠశాలలో చదువుకున్నారు. పాఠశాలలోనూ ఉత్తమ విద్యార్థిగా, మంచి వక్తగా, క్రీడాకారునిగా గుర్తింపు పొందారు. ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తున్న సమయంలోనూ ఆయనతో నాయకత్వ లక్షణాలు ఉన్నట్లు తల్లిదండ్రులు గ్రహించారు. పాఠశాలలోని వసతిగృహాల్లో ఒకటైన గుప్తా హౌస్‌కు ఆయన కెప్టెన్‌గా వ్యవహరించేవారు. తొలి ప్రయత్నంలోనే ఎన్‌డీఏ (నేషనల్ డిఫెన్స్ అకాడమీ)లో ర్యాంకు సాధించారు. సైన్యంలో చేరిన 2004 నుంచి వివిధ హోదాల్లో భారత సైన్యంలో సేవలు అందించి అందరి మన్ననలు పొందారు. డెహ్రాడూన్‌లో శిక్షణ పొందే సమయంలోనూ బ్యాచ్‌లో మెరుగైన ప్రతిభ చూపారు. చిన్ననాటి నుంచి అందిపుచ్చుకున్న నాయకత్వ లక్షణాలతోనే ఆర్మీలో వివిధ హోదాల్లో పనిచేసి అందరి మన్ననలు పొందారు. ప్రస్తుతం పనిచేస్తున్న బ్యాచ్‌లోనూ అందరికీ సంతోష్‌బాబు ఆప్తునిగా ఉండేవాడని తండ్రి ఉపేందర్ వెల్లడించారు. 2018లో కోరుకొండ సైనిక పాఠశాలలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విజయనగరం వచ్చినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. సూర్యాపేటకే చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు పల్లాడ వెంకటేశ్వర్లు కూతురు సంతోషి ని 2009లో వివాహం చేసుకున్నారు.
సంతోష్‌కు గుత్తా నివాళి
నల్గొండ అర్బన్: భారత్, చైనా సరిహద్దు ప్రాంతంలో దేశం కోసం మంగళవారం ప్రాణాలర్పించిన సూర్యాపేట జిల్లా వాసి కల్నల్ బిక్కుమల్ల సంతోష్‌కు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి నివాళి అర్పించారు. ఉమ్మడి జిల్లా నుంచి కల్నల్ స్థాయికి ఎదిగి దేశ సేవలు అందిస్తున్న జవాన్ వీరమరణం పాలవ్వడం విచారకరమన్నారు. ఆయన మృతదేహం వెంటనే స్వస్థలానికి చేరేలా చర్యలు చేపట్టాలని అధికారులను కోరినట్లు తెలిపారు.
ఉబికి వస్తున్న కన్నీళ్లను అదిమిపట్టి...!
చైనా-భారత్ సరిహద్దులో వీర మరణం పొందిన సంతోష్‌బాబు తల్లిదండ్రుల ఆత్మస్థైర్యం, గుండె నిబ్బరం అందరికీ కన్నీరు తెప్పించింది. పుట్టెడు దుఖాన్ని కడుపులో అనుచుకుంటూ భరతమాత కోసం కుమారుడి మృతి గర్వంగా ఉందంటూ ప్రకటించడం అందరినీ కలచివేసింది. కుమారుడితో తల్లిదండ్రులకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ విషాదంలో మునిగిపోయారు. వీర జవానుగా నాన్న ఆశయానికి ప్రాణం పోశారు. ఆయన అభిరుచికి అనుగుణంగా సైన్యంలో చేరి దేశానికి సేవలందించారు. తల్లిదండ్రుల కలలను సాకారం చేసిన భరతమాత ముద్దుబిడ్డగా వీర మరణం పొందారు. తల్లిదండ్రులకు, భార్యాపిల్లలకు తీరని దుఃఖాన్ని మిగిల్చి వెళ్లిపోయారు.
ఫేస్‌బుక్ నుంచి వాట్సప్ వరకు..
కర్నల్ సంతోష్‌బాబు మృతిపై సామాజిక మాధ్యమాల్లో నివాళులు మిన్నంటాయి. భరతమాత ముద్దుబిడ్డగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ఎన్నటికీ మర్చిపోరంటూ నినాదాలు హోరెత్తాయి. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్‌లల్లో కర్నల్ ఛాయాచిత్రాలకు నివాళులు అర్పించారు. పట్టణంలో ఉన్న వారికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పలువురు ఫోన్‌చేసి కర్నల్ మరణ వార్త గురించి ఆరా తీశారు.
అప్పుడు ముగ్గురు.. ఇప్పుడు ఒక్కరు