గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో అమరుడైన కర్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు పరామర్శించనున్నారు. విద్యానగర్‌లో నివాసముంటున్న కర్నల్ కుటుంబ సభ్యులను కలుసుకోనున్న సీఎం... ముందు ప్రకటించినట్లుగా వారి కుటుంబానికి చేయూతనివ్వబోతున్నారు. సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం తరుఫున 5 కోట్ల రూపాయల నగదు, నివాస స్థలం, ఆయన భార్యకు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఇంతకు ముందు కేసీఆర్ ప్రకటించారు. స్వయంగా తానే సంతోష్ బాబు ఇంటికి వెళ్లి.. సహాయం అందించనున్నట్లు తెలిపారు.
ఆర్డీవో నియామక పత్రాలతోపాటు ఇంటిస్థలం, 5 కోట్ల నగదు
సంతోష్ సతీమణికి ఆర్డీవో నియామక పత్రాలతోపాటు ఇంటిస్థలం, 5 కోట్ల నగదు చెక్కును కేసీఆర్ అందించనున్నారు. ఇదే ఘర్షణలో మరణించిన మిగిలిన 19 మంది సైనికుల కుటుంబాలకు పదేసి లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు సీఎం ఇంతకుముందే ప్రకటించారు. ఆ మొత్తాన్ని కేంద్ర రక్షణ మంత్రి ద్వారా అందిస్తామని తెలిపారు. కేసీఆర్ రాక దృష్ట్యా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సూర్యాపేటకు చేరుకోనున్న ముఖ్యమంత్రికి మంత్రి జగదీశ్ రెడ్డి స్వాగతం పలుకుతారు.