Sarpanch suicide attempt: నిధులు రావట్లేదని సర్పంచ్ దంపతుల ఆత్మహత్యాయత్నం.. - suryapet latest news
17:17 December 04
Sarpanch suicide attempt: నిధులు రావట్లేదని సర్పంచ్ దంపతుల ఆత్మహత్యాయత్నం..
Sarpanch suicide attempt: చేసిన పనులకు నిధులు మంజూరు కాకపోవడం వల్ల పలు జిల్లాల్లో సర్పంచులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న లక్ష్యంతో పలు చోట్ల అప్పులు తీసుకొచ్చి మరీ.. పనులు చేస్తున్నారు. అందుకోసం ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు మాత్రం విడుదల కావటం లేదు. అటు అప్పులు తీసుకొచ్చిన చోట వడ్డీలు పెరిగిపోవటంతో పాటు అవమానాలు.. ఇటు ఎన్నిరోజులు వేచి చూసినా నిధులు రాకపోవటంతో చాలా చోట్లు సర్పంచ్లు మనస్తాపానికి గురవుతున్నారు. కొందరు వినూత్న రీతుల్లో నిరసనలు తెలుపుతూ.. అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. మరికొందరేమో.. నిధులు రావట్లేదనే మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల ఎంపీడీవో కార్యాలయంలో అడ్లూరు గ్రామానికి చెందిన సర్పంచ్ దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. సర్పంచ్ కందుకూరి స్వాతితో పాటు ఆమె భర్త వెంకటేశ్వర్లు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న స్థానికులు అప్రమత్తమై.. ఇద్దరిని అడ్డుకున్నారు. పల్లె ప్రగతి పనులు చేసినా.. ఇప్పటివరకు బిల్లులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్తోమత మేరకు సొంత డబ్బు పెట్టి అభివృద్ధి చేసినా.. బిల్లు రాకుండా కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గతంలోనూ.. పలువురు సర్పంచ్లు నిధులు ఆలస్యం కారణంగా ఆత్మహత్యకు యత్నించిన సందర్భాలున్నాయి.
ఇదీ చూడండి: