సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీ మాధవరాయినిగూడెంలో జరిగిన బావి వివాదంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. గ్రామంలో ఉన్న ఓ వ్యవసాయ భూమి మున్సిపాలిటీకి చెందుతుందని స్థానికులు ఫిర్యాదు చేయగా... కొన్ని రోజులుగా సర్వే నిర్వహిస్తున్నారు. సదరు వ్యవసాయ బావిని వాడుకుంటున్న మోదాల సైదులు కుటుంబసభ్యులు ప్రతీసారి సర్వేను అడ్డుకుంటూ వస్తున్నారు.
అధికారుల ఎదుటే వ్యక్తి ఆత్మహత్యాయత్నం - suicide news
వ్యవసాయ బావి వివాదంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీ మాధవరాయినిగూడెంలో జరిగింది. తరతరాలుగా వాడుకుంటున్న బావి మున్సిపాలిటీ పరిధిలోకి వస్తోందని అధికారులు చెప్పగా మనస్థాపం చెందిన వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.
పోలీసుల సహకారంతో అధికారులు సర్వే చేసేందుకు బావి వద్దకు రాగా... కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అధికారులకు బాధితులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుందని అధికారులు చెప్పగా... మనస్థాపం చెందిన సైదులు ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే స్పందించిన పోలీసులు అడ్డుకున్నారు.
తరతరాల నుంచి ఆ భూమి తమ అధీనంలోనే ఉందని మోదాల సైదులు తెలిపాడు. కావాలనే కొందరు తమపై కక్ష్య సాధింపు చర్యకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మున్సిపాలిటీ పరిధిలో అనేక ప్రభుత్వ స్థలాలకు సరిహద్దులు పెట్టకపోవటం వల్ల ఆక్రమణదారులు కబ్జా చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రెసిడెంట్ తన్నీరు మల్లిఖార్జున్ ఆరోపించారు. అధికారులు తక్షణమే లే అవుట్ స్థలాల్లో నిర్మించిన కట్టడాలు కూల్చి వేయాలని డిమాండ్ చేశారు.