తెలంగాణ

telangana

ETV Bharat / state

బీడీలు చుట్టిన చేతులతో.. నోరూరించే పచ్ఛళ్లు

కొన్నినెలల క్రితం వరకూ సాధారణ గ్రామీణ మహిళలు. పొట్టకూటి కోసం బీడీలు చుట్టడం.. కూలికి వెళ్లడం వంటి పనులు చేసేవారు. కానీ ఇప్పుడు వారే స్వయం ఉపాధి పొందుతున్న వ్యాపారవేత్తలు. ప్రభుత్వ సహకారంతో వినూత్న వ్యాపారం ప్రారంభించి.. ఇతర మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు సిద్దిపేట మహిళా సంఘాల సభ్యులు.

బీడీలు చుట్టిన చేతులతో.. నోరూరించే పచ్ఛళ్లు
woman-produce-meet-on-wheels-in-siddipet

By

Published : Jan 3, 2020, 8:29 PM IST



అభివృద్ధి అంటే రోడ్లు వేయడం.. మురుగు కాలువలు తవ్వడం.. నాలుగు భవనాలు కట్టడం కాదని.. ప్రజల జీవన ప్రమణాలు పెరగి వారు సంతోషంగా జీవించడమే నిజమైన అభివృద్ధి అని ఆర్థిక మంత్రి హరీశ్ రావు పదే పదే అంటుంటారు. అందుకు అనుగుణంగానే సిద్దిపేటలో మౌలిక వసతుల కల్పనతోపాటు ప్రజల ఉపాధి కల్పనపైనా.. ఆయన దృష్టిసారించారు.

స్వయం ఉపాధి కల్పించేలా చర్యలు..

సరైన విద్యార్హతలు, నైపుణ్యాలు లేక బీడీలు చుడుతున్న మహిళల ఉపాధి కల్పనపై హరీశ్​రావు ప్రత్యేక దృష్టి సారించారు. మహిళలకు ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించి.. పొదుపు సంఘాల ద్వారా ఆహారోత్పత్తుల వ్యాపారం ప్రారంభింపజేసి.. స్వయం ఉపాధి కల్పించేలా చర్యలు ప్రారంభించారు. ఇందుకోసం 'మన సిద్దిపేట' పేరుతో ప్రత్యేకంగా బ్రాండ్ సైతం తయారు చేశారు. గ్రామాలు యూనిట్​గా ఆయా మహిళా సంఘాల సభ్యుల అభిరుచికి అనుగుణంగా ఉత్పత్తులు ప్రారంభించారు.

మీట్ ఆన్ వీల్స్..

మొదటి దశలో భాగంగా.. ఇర్కోడ్​కు చెందిన 20 మంది మహిళలకు రుచి, శుచితో నాణ్యమైన మాంసం ఉత్పత్తుల తయారీపై జాతీయ మాంస పరిశోధన సంస్థలో శిక్షణ ఇప్పించారు. వీరు చికెన్, మటన్ పచ్చళ్ల తయరీతో వివిధ రకాల మాంసం స్నాక్స్ తయారీపై జాతీయ మాసం పరిశోధన సంస్థలో శిక్షణ పొందారు. అనంతరం ప్రభుత్వ సహకారంతో పరికరాలు, వాహనం సమకూర్చుకున్నారు. మీట్ ఆన్ వీల్స్ పేరుతో నాణ్యమైన మాంసం ఉత్పత్తులు ప్రజలకు అందించడం ప్రారంభించారు.

ప్రత్యేక జాగ్రత్తలు..

సరసమైన ధరలో నాణ్యమైన మాంసం ఉత్పత్తులు అందించడానికి వీరు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీరే స్వయంగా మేకలు, గొర్రెలు, కోళ్లను ఎంపిక చేసుకొని.. వాటిని నుంచి మాంసం సేకరిస్తున్నారు. ప్రస్తుతం చికెన్, మటన్ పచ్చళ్లతో పాటు పది రకాల స్నాక్స్ అందిస్తున్నారు. ఉదయం 10 గంటలకే తమ సంఘ భవనం వద్దకు వచ్చి ఆ రోజుకు కావాల్సిన ముడి సరుకులు సిద్ధం చేసుకొని.. పచ్చళ్లను ప్యాకింగ్ చేసుకుంటారు. సాయంత్రం నాలుగు గంటలకు తమ వాహనాన్ని పట్టణంలోని చౌరస్తాకు తీసుకెళ్లి.. అమ్మకాలు సాగిస్తారు.

ప్రజల నుంచి ఆదరణ..

తక్కువ ధరలో రుచి, శుచికరమైన ఆహార పదార్థాలు అందిస్తుండటం వల్ల ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. వీరి ఉత్పత్తుల అమ్మకం కోసం రైతుబజారులో ప్రత్యేకంగా ఓ దుకాణం సైతం ఏర్పాటు చేశారు.

బీడీలు చుట్టడం వల్ల అనారోగ్యానికి గురయ్యేవాళ్లమని.. గతం కంటే బాగుందని.. మహిళా సంఘాల సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదేస్ఫూర్తితో ఇతర గ్రామాల్లో సైతం నాటుకోళ్ల పెంపకం, పప్పుల ఉత్పత్తి, అల్లం పేస్టు తయారీ వంటి వ్యాపారాలు ప్రారంభించారు.

నోరూరించే పచ్ఛళ్లు

ఇవీ చూడండి: నడిరోడ్డుపై పోకిరిని చితక్కొట్టిన మహిళలు

ABOUT THE AUTHOR

...view details