ప్రతి రచయిత.. తమ రచనలను పుస్తక రూపంలోకి తెచ్చేందుకు తహతహలాడుతుంటారు. ఇందులో కొందరు సఫలమవుతారు.. మరికొందరు విఫలమవుతుంటారు. రచయితలు ఇలాంటి ఇబ్బందులు పడకుండా అంతర్జాలంలో పుస్తకాలను(ఈ-బుక్) పొందుపరచే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ-పీజీ కళాశాల. కళాశాల పీజీ తెలుగు విభాగం అనుబంధంగా ఏర్పాటైన కేవీ రాఘవాచార్య స్మారక సాహిత్య పీఠం ఇందుకు నడుం బిగించింది. కళాశాల విద్యార్థులు, అధ్యాపకులతో పాటు పూర్వ విద్యార్థులు, అధ్యాపకులకు అవకాశం కల్పిస్తూ.. రచనలను ఆన్‌లైన్‌లో ఈ-పుస్తకాల రూపంలో అందుబాటులోకి తెస్తున్నారు.
సాంకేతికత వేదికగా..
నేటి సాంకేతిక యుగంలో అత్యధికులు ఇంటర్‌నెట్ వినియోగిస్తుండటంతో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ-పీజీ కళాశాలలో పీఠం ఆధ్వర్యంలో ఈ-బుక్ వెలువరించాలని నిర్ణయించారు. తొలి ప్రచురణగా కళాశాలలో పీజీ వృక్షశాస్త్ర అధ్యాపకుడు డా.ఎం.శ్రీనివాస్ ‘నా మది..’లో పేరిట రూపొందించిన కవితల పుస్తకాన్ని వెలువరించారు. పీఠం ఆధ్వర్యంలో ప్రచురించే ఈ-పుస్తకాలను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక archive.org వెబ్‌సైట్‌లో లేదంటే కళాశాలకు సంబంధించిన కేవీ రాఘవాచార్య స్మారక సాహిత్య పీఠం బ్లాగ్‌లో చూడవచ్చు. పరిశోధన, సాహిత్యపరమైన అంశాలు వెలువరించే క్రమంలో ఐఎస్‌బీఎన్(ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నంబరు)ను సంబంధిత సంస్థ కేటాయిస్తుంది.