సిద్దిపేట జిల్లా ఐనాపూర్లో విషపూరిత కేకుతిని తండ్రీకొడుకు మృతిచెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిపాలైన చిన్నారి పూజిత గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. తల్లి భాగ్యలక్ష్మి సిద్దిపేట ప్రభుత్వాసుపత్రిలో ఉంది. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. మిస్టరీగా మారిన ఈ కేసును హుస్నాబాద్ పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దోషులను పట్టుకునేందుకు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు.
అన్ని కోణాల్లోనూ దర్యాప్తు
ప్రధాన అనుమానితుడు.. కేకు పంపించిన శ్రీనును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీను చెబుతున్న సమాధానాలతో సంతృప్తి చెందని పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అతడి కాల్ డాటాను, ఆ రోజు తిరిగిన ప్రదేశాల్లో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. మరెవరైనా ఈ నేరంలో పాలుపంచుకున్నారా అనే కోణంలోనూ విచారిస్తున్నారు. ఇతర బంధువులను కూడా విచారించారు.