పచ్చదనానికి అధిక ప్రాధాన్యతనిచ్చే ఆర్థిక మంత్రి హరీశ్‌రావు... మొదటి నుంచి తన నియోజకవర్గం సిద్దిపేటలో విరివిగా మొక్కలు నాటించారు. హరితహారం పథకం ద్వారా సిద్దిపేటలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి లక్షల్లో మొక్కలు నాటించారు. మొదటి, రెండో విడతల్లో నాటినవి చెట్లుగా ఎదిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. కొందరు హరిత స్ఫూర్తిని అందుకోలేక... అవగాహన లోపంతో... మొక్కలను, చెట్లను ధ్వంసం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన హరీశ్... నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా పురపాలక సంఘం పరిధిలో హరితహారానికి ప్రత్యేక అధికారిని నియమించారు.
తప్పు చేస్తే... జరిమానా... జైలు శిక్ష
సిద్దిపేట పురపాలక సంఘం హరితహారం ప్రత్యేకాధికారి ఐలయ్య. ఉదయమే ద్విచక్రవాహనంపై పట్టణంలో ప్రతి రోడ్డు తిరిగి మొక్కలను పరిశీలిస్తారు. ఎక్కడైనా మొక్కలను, చెట్లను ధ్వంసం చేసినట్లు ఉంటే.. కారకులను గుర్తించే ప్రయత్నం మొదలు పెడతాడు. స్థానికులను విచారిస్తాడు. దానితో పాటు.. సీసీ కెమేరా ఫుటేజీ పరిశీలించి.. ధ్వంసం చేసిన వారిని గుర్తిస్తాడు. వారికి వేల రూపాయల జరిమానా విధించడంతో పాటు... వారితోనే కొత్త మొక్కలు తెప్పించి... నాటించి.. సంరక్షణ బాధ్యతల హామీ తీసుకుంటాడు. తీవ్రత ఎక్కువ ఉంటే పోలీసు కేసు సైతం నమోదు చేస్తున్నాడు. ఇప్పటివరకు 36 మందిపై జరిమానాలు విధించగా... ఐదుగురిపై కేసులు నమోదు చేశారు.