ఇప్పటి వరకూ చేపలను దిగుమతి చేసుకునే తెలంగాణ రాష్ట్రం.. ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్ధిపేటలోని మంత్రి నివాసం వద్ద మత్స్యశాఖ ఆధ్వర్యంలో మొబైల్ ఫిష్ ఔట్ లెట్- సంచార వాహనాన్ని ప్రారంభించిన మంత్రి.. ఈ వాహనాలు మత్స్యకారులకు బాసటగా నిలుస్తాయని అన్నారు. సిద్ధిపేట సొసైటీ లబ్ధిదారు మహిళా మత్స్య పారిశ్రామిక సంఘ సభ్యులు కాముని భాగ్యమ్మ, తదితరులకు వాహనాలను అందించారు.
తొందరలోనే రాష్ట్రంలోని ప్రతి పట్టణంలో చేపల సంచార వాహనాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో కూడా సంచార చేపల విక్రయ వాహనాలను తెచ్చినట్లు చెప్పారు. . ఉమ్మడి రాష్ట్రంలో మత్స్య శాఖకు రూ.10 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ ఉండేదని, కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక ప్రస్తుతం100 కోట్ల బడ్జెట్‌ను కేటాయించామన్నారు. దేశంలో కుల వృత్తులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే అని మంత్రి కొనియాడారు.
రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క మత్స్యకారుడు ఖాళీగా ఉండకుండా ఉపాధి కల్పిస్తున్నామని, మొబైల్ వెహికిల్స్ ద్వారా నాణ్యమైన చేపలను అందిస్తామని, ముఖ్యంగా మహిళలకు ఈ వాహనాలను అందజేస్తే ఎంతో ఉపయోగకరమని మంత్రి హరీశ్ వెల్లడించారు. మహిళ సంఘ సభ్యులు చేపల విక్రయాలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించినట్లు మంత్రి తెలిపారు.