Minister Ponnam Prabhakar Participate in Program at Husnabad : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మెడికల్ కళాశాల(Medical College) ఏర్పాటు కోసం స్థల సేకరణ జరుగుతోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్‌లో జరిగిన పలు కార్యక్రమాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని, మాట్లాడారు. తాను ఎంపీగా ఉన్న సమయంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలను ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు.
హుస్నాబాద్‌లో కేంద్రీయ విద్యాలయం కోసం ప్రయత్నం చేస్తున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) వెల్లడించారు. ఈ పట్టణంలోని వార్డుల్లో సమస్యలు తెలుసుకొని, పరిష్కార మార్గం చూపెడతామని పాలకవర్గానికి దిశా నిర్దేశం చేశారు. రాజకీయాలకు అతీతంగా హుస్నాబాద్ అభివృద్ధి కోసం కలిసికట్టుగా పని చేస్తామన్నారు. ఏ సమస్యలు ఉన్న మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రజలు నేరుగా తనను కలవచ్చని చెప్పారు. గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు తెలుసుకొని, వాటిని పరిష్కరించి సాధ్యమైనంత త్వరగా గౌరవెల్లి ప్రాజెక్టును అందరి సమక్షంలో ప్రారంభించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రజాదర్బార్‌తో ప్రజల సమస్యల పరిష్కరాన్ని పూర్తిగా మార్చేశాం : పొన్నం ప్రభాకర్
"ఆనాడు నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు వేములవాడు, హుజూరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్ ఈ నాలుగింటిని మున్సిపాలిటీలుగా చేయించడం జరిగింది. ప్రియాంక గాంధీ వచ్చి హుస్నాబాద్‌కు మెడికల్ కాలేజీని ప్రకటించారు. వారి ప్రకటన మేరకు హుస్నాబాద్‌లో స్థల సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం తేవాలని అనుకుంటున్నాం. దానికి తగ్గ ప్రతిపాదనలు చేస్తున్నాము. ఆరోగ్యం, పారిశుద్ధ్యం, అభివృద్ధి, రింగురోడ్డు వంటి అంశాలను మేనిఫెస్టోలో పెట్టుకున్నాము. గౌరవెల్లి ప్రాజెక్టు ముంపు గ్రామాల సమస్యను వీలైనంత త్వరలో పరిష్కరిస్తాం. నియోజకవర్గంలో పేదలందరికీ రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తాం."- పొన్నం ప్రభాకర్, మంత్రి