కేంద్ర ప్రభుత్వ తీరు వల్లే నిరసన తెలపడానికి దిల్లీ వెళ్లిన రైతుల్లో ఐదుగురు మృతి చెందారని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. జల ఫిరంగుల ధాటికి ముగ్గురు, చలి తీవ్రత తట్టుకోలేక ఇద్దరు చనిపోయారన్నారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండల సర్వసభ్య సమావేశంలో అతిథిగా మంత్రి పాల్గొన్నారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా మండల పరిషత్ చేసిన తీర్మానాన్ని ఆయన స్వాగతించారు.
ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్న రైతులకు ఆయన మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాన్ని తెచ్చి కార్పొరేట్‌కు అనుకూలంగా వ్యవహారిస్తోందని హరీశ్ రావు ధ్వజమెత్తారు. దేశంలోని 5 రాష్ట్రాల నుంచి 99 వేల ట్రాక్టర్లలో రైతులు దిల్లీకి కదిలివచ్చి సమ్మె చేస్తూ నిరసన తెలిపితే... కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా అణిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.