తెలంగాణ

telangana

ETV Bharat / state

High Court: మల్లన్నసాగర్‌ పరిహారంలో ప్రభుత్వ తీరుపై అసహనం - తెలంగాణ హైకోర్టు వార్తలు

మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు పరిహారం పంపిణీలో... ఒంటరిగా ఉంటున్న వృద్ధులను కుటుంబంగా పరిగణించాలనే వినతులను... ఎందుకు పరిష్కరించలేదంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రాజెక్టు నిమిత్తం ఆస్తులను తీసుకొని.... వారి వినతి పత్రాలను పట్టించుకోరా అని నిలదీసింది.

high-court-serious-on-government-on-mallanna-sagar-project-compensation-issue
High Court: మల్లన్నసాగర్‌ పరిహారంలో ప్రభుత్వ తీరుపై అసహనం

By

Published : Jun 23, 2021, 9:41 AM IST

కొడుకులు, కూతుళ్లతో సంబంధం లేకుండా ఒంటరిగా ఉన్న వృద్ధులను కుటుంబంగా పరిగణించి పరిహారం చెల్లించాలన్న వినతులను ఎందుకు పరిష్కరించలేదంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రాజెక్టు నిమిత్తం వారి ఆస్తులను తీసుకొని.. వారి వినతి పత్రాలను పట్టించుకోరా అంటూ నిలదీసింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టులో భాగంగా ముంపు ప్రాంతాల వారి పునరావాస పరిహారంలో తలెత్తిన వివాదంలో హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

మల్లన్నసాగర్ భూసేకరణలో భాగంగా పునరావాస, పునర్నిర్మాణ పథకం నిబధనల ప్రకారం పరిహారం చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ సిద్ధిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్‌కు చెందిన కమలమ్మ, అన్నవ్వ సహా మరో 50 మంది వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్ వేశారు. వీరి కొడుకులకు పరిహారం చెల్లించినందున పిటిషనర్లకు పరిహారం ఇవ్వమని అధికారులు చెబుతున్నారని.. పిటిషనర్ తరుపు న్యాయవాది తెలిపారు. పిటిషనర్లలో 9 మందికి కుమారులెవరూ లేక ఒంటరిగా ఉన్నా.. వారికి సైతం పరిహారం చెల్లించలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. భూ సేకరణలో భాగంగా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ వాసులను ఖాళీ చేయించొద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. పరిహారానికి సంబంధించిన వివాదంలో దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లను విచారించిన ధర్మాసనం.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది.

ఒంటరి వృద్ధులకు, ఎలాంటి వివాదం లేనివారికి పరిహారం చెల్లించాలని హైకోర్టు సూచించినా పట్టించుకోలేదని వెల్లడించారు. కనీసం కౌంటరు దాఖలు చేయలేదన్నారు. వృద్ధులు చనిపోతే పరిహారం మిగులుతుందన్న ఉద్దేశం ఉన్నట్లుందన్నారు. ఇతర పిటిషన్​లలో స్టే ఉన్నప్పటికీ బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని తెలిపారు. 75 ఇళ్లను కూల్చి వేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమయంలో పరిహారం కూడా లేకుండా వారంతా ఎక్కడికి వెళ్తారంటూ ప్రశ్నించారు.

ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని విచారణ చేపట్టిన ధర్మాసనం బాధితుల వినతి పత్రాలు పరిష్కరించటం ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ కోర్టును ఆశ్రయించలేరని పేర్కొంది. ప్రభుత్వం భూములు లేనివారికి భూమి ఇస్తున్న ప్రభుత్వం... ప్రాజెక్టు కోసం త్యాగం చేసినవాళ్లకి పరిహారం మాత్రం ఇవ్వదా...? అంటూ ప్రశ్నించింది. పిటిషనర్లకు పరిహారం చెల్లించాలనుకుంటే ప్రభుత్వానికి కష్టసాధ్యమేమి కాదన్నారు. పిటిషనర్లు సమర్పించిన వినతి పత్రాలను పరిశీలించి వారి అర్హతలకు సంబంధించి నిర్ణయం తీసుకొని చెప్పాలని, లేదంటే ఎందుకు నిరాకరిస్తున్నారో చెబితే అంశాన్ని తేలస్తామంది. ఒకవేళ అధికారులు సానుకూల నిర్ణయం తీసుకుంటే ఈ పిటిషన్ల విచారణ అవసరమే లేదంది. ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పాలంటూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. అదేవిధంగా పునరావాస ప్యాకేజీ అందించిన వివరాలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

ఇదీ చూడండి:CORONA: ఇది ఊరటే.. మహమ్మారి ఊరొదిలి పోలే

ABOUT THE AUTHOR

...view details