రంగనాయకసాగర్ నుంచి మల్లన్నసాగర్ జలాశయానికి నీటిని తరలించి అక్కడి నుంచి కొండపోచమ్మసాగర్‌కు తరలించాలన్నది సర్కారు ప్రణాళిక. వివిధ కారణాలతో మల్లన్నసాగర్ జలాశయం నిర్మాణ పనులు పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మల్లన్నసాగర్ జలాశయంతో ప్రమేయం లేకుండా ప్రత్యామ్నాయ కాలువ ద్వారా కొండపోచమ్మ సాగర్ దిశగా నీటిని తరలించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది.
ఎత్తిపోతలకు కసరత్తు... ఈనెల 11న ప్రారంభించే అవకాశం..! - తుక్కాపూర్‌లోని సొరంగంలో పంప్‌హౌజ్
సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్‌లోని సొరంగంలో నిర్మించిన మల్లన్నసాగర్ సర్జిపూల్‌లో నీటి మట్టం శుక్రవారం నాటికి 474 మీటర్లకు చేరింది. దీంతో నీటిని కాలువలోకి ఎత్తిపోసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈనెల రెండో వారంలో నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇందులో భాగంగా తుక్కాపూర్ పంప్‌హౌజ్ నుంచి గజ్వేల్ మండలం అక్కారం పంప్‌హౌజ్ వరకు 30 కి.మీ. బహిరంగ కాలువ నిర్మించింది. అక్కారం నుంచి కొండపోచమ్మ జలాశయం వరకు నీటిని తరలించడానికి 2.5 కి.మీ.మేర పైప్‌లైన్, ఆరు కి.మీ.మేర కాలువ నిర్మించారు.
మే నెలలోనే కొండపోచమ్మ సాగర్‌లోకి నీటిని తరలించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ప్యాకేజీ -12 (మల్లన్నసాగర్) పంప్‌హౌజ్ నుంచి నీటిని తరలించడం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో రంగనాయకసాగర్ నుంచి అధికారులు శుక్రవారం 250 క్యూసెక్కుల నీటిని మల్లన్నసాగర్ కాలువలోకి వదలడం వల్ల తుక్కాపూర్‌లో సర్జిపూల్ నీటి మట్టం 474 మీటర్లకు చేరింది. ఇక్కడ 43 మెగావాట్ల సామర్థ్యం కల్గిన ఎనిమిది పంప్‌లు ఉన్నాయి.