గౌరవెల్లి ప్రాజెక్ట్ భూనిర్వాసితులు మంత్రి హరీష్‌రావుతో చర్చలు జరిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మెట్టుబండల వద్ద మాజీ ఎంపీ పొన్నం, కాంగ్రెస్ నేతలతో కలిసి మంత్రితో చర్చించారు. గంటసేపు జరిగిన చర్చల్లో మంత్రి హరీశ్‌రావు ముందు భూనిర్వాసితులు తమ డిమాండ్లను ఉంచి పరిహారం చెల్లించాలన్నారు. నిర్వాసితుల డిమాండ్లపై మంత్రి హరీశ్‌రావు సానుకూలంగా స్పందించడంతో... చర్చలు సఫలమయ్యాయి.
చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్.. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినందున నిర్వాసితుల డిమాండ్లు నెరవేర్చాలని సర్కారుని డిమాండ్ చేశారు. దాడులు, లాఠీఛార్జీలతో సమస్య పరిష్కారం కాదన్న పొన్నం...భూనిర్వాసితులతో సమావేశమై వాళ్ల సమస్య పరిష్కరించాలన్నారు.
గౌరవెల్లి ప్రాజెక్టుకు మొదట ప్రతిపాదన చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రాజెక్టు ఫలితాలు బాధితులకు అందటం లేదని మంత్రితో చర్చలకు కాంగ్రెస్ పార్టీ మధ్యవర్తిత్వం చేసింది. 18ఏళ్లకు పైబడిన వారికి ప్యాకేజ్, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజ్ కీలకమైంది. రేపు గ్రామస్థులతో చర్చించి.. తుది నిర్ణయం తీసుకుంటాం. సమస్య పరిష్కారం అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. -పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ