చిన్నపాటి మెలుకువలతో వ్యవసాయాన్ని లాభసాటి చేసి చూపిస్తున్నాడు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కూచనపల్లికి చెందిన గూళ్ల మల్లయ్య. వ్యవసాయ భూమి లేదని మల్లయ్య నిరాశ చెందలేదు. మండలంలోని పందిళ్లలో 7ఎకరాల భూమి కౌలుకు తీసుకున్నాడు. 5 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న సాగు చేస్తున్నాడు. మిగతా రెండెకరాల్లో కూరగాయలు సాగు చేశాడు. రెండు రోజులకోసారి మార్కెట్లో విక్రయించి అధిక ఆదాయం అర్జిస్తున్నాడు.
డిమాండ్‌కు అనుగుణంగా
అందరిలా కాకుండా మార్కెట్లో ఏ సమయంలో ఏ కూరగాయలకు డిమాండ్ ఉంటుందో ముందుగానే అంచనా వేస్తాడు మల్లయ్య. అందుకు అనుగుణంగానే కూరగాయల పంటలు వేస్తాడు. ప్రస్తుతం మిరప, క్యారెట్, బెండ, కాకర, టొమాటోతో పాటు బెండలో అంతర పంటగా సొరకాయ సాగు చేశాడు. అన్నింటికీ కలిసి సుమారు 30 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టినట్టు మల్లయ్య చెబుతున్నాడు. టమాట మినహా మిగిలినవన్నీ దిగుబడులు వస్తున్నాయి.