సిద్దిపేట రూరల్ మండలంలోని సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడక అనుబంధ గ్రామమైన అంకంపేట గ్రామంలో 43 రెండు పడకల ఇళ్ల సామూహిక నూతన గృహా ప్రవేశాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. నూతనంగా నిర్మించనున్న మరో 21 డబుల్ బెడ్ రూం ఇళ్లకు భూమి పూజ చేశారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో అంకంపేట, సీతారాంపల్లి, శంకర్‌నగర్, ఎస్సీ కాలనీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు చాలా బాగా నిర్మించామని హరీశ్ రావు అన్నారు. చింతమడక, అంకంపేటలో నూతనంగా ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ పాఠశాల, వీధి దీపాలు, బీటీ రోడ్లు త్వరలో నిర్మిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ను జీవితాంతం గుర్తు పెట్టుకోవాలన్నారు.
కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం దొడ్డు వడ్లు కొనుగోళ్లు చేయడం లేదని విమర్శించారు. పెట్రోల్, గ్యాస్ సిలిండర్ల ధర పెంచడంతో ప్రజలపై భారం పడిందని చెప్పారు. భాజపా ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిందన్నారు. మెదక్ జిల్లాలో పాదయాత్ర చేసే వారు.. రైతలు, జిల్లా ప్రజలపై ప్రేమ ఉంటే పెంచిన సిలిండర్ల ధర తగ్గించేందుకు పాదయాత్ర చేయాలన్నారు. డీజిల్ ధరలు పెంచి రైతుల నడ్డి విరుస్తోందని ఆరోపించారు.