తెలంగాణ

telangana

ETV Bharat / state

'భూ సమస్యలు పరిష్కరిస్తా.. పాసుపుస్తకాలు పంచుతా' - సీఎం కేసీఆర్​ తాజా వార్తలు

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం ఇటిక్యాల రెవెన్యూ పరిధిలోని మూడు గ్రామాల రైతులు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇటిక్యాల కొత్తపేట సర్పంచులు, కలెక్టర్‌లతో ముఖ్యమంత్రి కేసీఆర్ చరవాణి లో మాట్లాడారు.

సిద్దిపేట జిల్లా రైతులతో మాట్లాడిన సీఎం కేసీఆర్‌
సిద్దిపేట జిల్లా రైతులతో మాట్లాడిన సీఎం కేసీఆర్‌

By

Published : Jul 24, 2020, 10:39 PM IST

Updated : Jul 25, 2020, 3:05 AM IST

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని మూడు గ్రామాలకు చెందిన 258 మంది రైతులు దశాబ్దాల కాలంగా భూ సమస్యలతో ఇబ్బందులు పాలవుతున్నారు. ప్రధానంగా ఇటిక్యాలతోపాటు ఆ గ్రామ రెవెన్యూ పరిధిలోని కొత్తపేట లింగారెడ్డిపల్లి గ్రామాల్లో దాదాపు ఆరు వందల ఎకరాల భూములు రికార్డుల పరంగా నమోదై ఉన్నాయి. దస్త్రాలు సరిగా లేకపోవడం వాటికి దేశ్​ముఖ్​లు భూస్వాములుగా పేర్లు రావడం వల్ల రైతులకు తలనొప్పిగా మారింది.

పూర్వీకులు భూస్వాముల వద్ద కొనుగోలు చేసినప్పటికీ అవి ఇనాం భూములుగానే రావడం వల్ల చాలా మంది రైతులకు వారి పేరున పట్టా మార్పిడి కావడం లేదు. దీంతో చాలా కాలంగా కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిన ఆ రైతులు భూ సమస్యలు పరిష్కరించి తమకు న్యాయం చేస్తే తప్ప... ఎన్నికల్లో ఓట్లు వేయమని కిందటి శాసనసభ ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ భూ దస్త్రాల సవరణకు హామీ ఇవ్వడంతో పాటు ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ శుక్రవారం మండల పరిధిలోని ఇటిక్యాల కొత్తపేట సర్పంచులకు ఫోన్ చేశారు. వారి గ్రామాలకు వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్‌ను పంపిస్తున్నానని ఆయనకు సమస్య వివరించారని చెప్పారు. కొద్దిసేపటికే జిల్లా వ్యవసాయ అధికారి కొత్తపేట గ్రామానికి చేరుకున్నారు. అనంతరం కలెక్టర్ వెంకట్రామ రెడ్డికి ఫోన్ చేశారు. అదే ఫోన్‌లో సర్పంచులతో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు.

ఇటిక్యాల రెవిన్యూ పరిధిలోని మూడు గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు హామీ ఇచ్చారు. రెవెన్యూ వ్యవసాయ అధికారులు రెండు రోజులపాటు గ్రామంలో ఉండి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని సీఎం రైతులకు భరోసా ఇచ్చారు. దస్త్రాలను సవరించడంతోపాటు రెండు రోజుల్లో అర్హులైన రైతులకు రైతుబంధు అందేలా కలెక్టర్ చర్యలు తీసుకుంటారని వివరించారు. దస్త్రాల సవరణ పూర్తయిన వెంటనే తానే స్వయంగా గ్రామాన్ని సందర్శించి కొత్త పాసు పుస్తకాలను పంపిణీ చేస్తానని సీఎం చెప్పినట్లు ఆ గ్రామ రైతులు తెలిపారు. దశాబ్దాల కాలం నాటి భూ సమస్యలకు పరిష్కారం లభించే మార్గం ఏర్పడడం వల్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:కేటీఆర్​కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్​రావు

Last Updated : Jul 25, 2020, 3:05 AM IST

ABOUT THE AUTHOR

...view details