శామీర్ పేట్ ఓఆర్ఆర్ టోల్ ప్లాజా వద్ద పట్టుకున్న రూ. 40 లక్షల నగదు దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థి రఘనందన్ రావుదిగా తేలిందని బాలానగర్ డీసీపీ పద్మజారెడ్డి తెలిపారు. శామీర్ పేట్ ఓఆర్ఆర్ టోల్ ప్లాజా వద్ద సోమవారం రాత్రి సైబరాబాద్ ఎస్వోటీ, శామీర్ పేట్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా... రూ. 40 లక్షల నగదు పట్టుబడింది.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నుంచి ఓఆర్ఆర్ మీదుగా సిద్దిపేటకు నగదు తరలిస్తున్నట్లు పక్కా సమాచారం మేరకు టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా క్రెటా వాహనంలో నుంచి ఓ వ్యక్తి దిగి బ్యాగ్ పట్టుకుని పరుగెడుతుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు పేర్కొన్నారు.