తెలంగాణ

telangana

ETV Bharat / state

దుబ్బాక విజయంతో కమలం నేతల్లో కొత్తజోష్‌ - దుబ్బాక విజయానికి బీజేపీకి కలిసొచ్చిన అంశాలు

దుబ్బాక గులాబీ తోటలో కమలం వికసించడం భాజపా నేతల్లో కొత్త జోష్‌ నింపింది. ఇదే ఉత్సాహంతో త్వరలో జరిగే జీహెచ్​ఎంసీ, పట్టభద్రుల ఎన్నికల్లోనూ గెలుపే లక్ష్యంగా సిద్ధమవుతున్నారు. మరోవైపు రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 4 ఉపఎన్నికల్లో.. మూడింట విజయకేతనం ఎగురవేసిన తెరాస.. దుబ్బాకను చేజార్చుకోవడంపై లోటుపాట్లను పరిశీలిస్తోంది. తెరాసకు ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్‌కు.. దుబ్బాకను భాజపా ఎగురేసుకుపోవడం మింగుడు పడడం లేదు.

దుబ్బాక విజయంతో కమలం నేతల్లో కొత్తజోష్‌
దుబ్బాక విజయంతో కమలం నేతల్లో కొత్తజోష్‌

By

Published : Nov 11, 2020, 5:01 AM IST

Updated : Nov 11, 2020, 7:11 AM IST

దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా, తెరాస, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లో తెరాస సిట్టింగ్ స్థానాన్ని భాజపా కైవసం చేసుకుంది. 2014 నుంచి జరిగిన వరుస ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్న తెరాసకు దుబ్బాకలో ఓటమితో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రెండేళ్ల క్రితం దుబ్బాకలో సాధారణ ఎన్నికల్లో డిపాజిట్‌ రాని స్థితి నుంచి ఉపఎన్నికల్లో అనూహ్య విజయం సాధించడం వెనుక భాజపా వ్యూహాలున్నాయి.

తమ అభ్యర్థనలను బలంగా తీసుకెళ్లారు..

ప్రశ్నించే గొంతుకకు ఒక్క అవకాశమివ్వాలనే అభ్యర్థనను ఆ పార్టీ నేతలు ఓటర్లలోకి బలంగా తీసుకెళ్లగలిగారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లోనూ కేంద్రం వాటా ఉందని.. అది తెరాస సర్కారు చెప్పడం లేదని ఎదురుదాడికి దిగారు. సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటలను అభివృద్ధి చేసుకున్నట్లుగా దుబ్బాకను అభివృద్ధి చేయలేదని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అంతేకాకుండా రఘునందన్‌ రావుపై పలు సందర్భాల్లో పోలీసులు వ్యవహరించిన తీరు, ప్రధాన పార్టీల ముగ్గురు అభ్యర్థుల్లో విద్యావంతుడు కావడం, స్థానిక సమస్యలపై ఆయన చేసిన పోరాటాలు కలిసొచ్చాయి. గతంలో పోటీ చేసి ఓడిపోయిన సానుభూతి కూడా కొంత మేర పనిచేసింది.

ఆకట్టుకునేలా ప్రసంగాలు..

కేంద్ర సహాయమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అర్వింద్​, నియోజకవర్గ ఎన్నికల ఇంఛార్జీ.. మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి.. ఓటర్లను ఆకట్టుకునేలా ప్రసంగిస్తూ ముందుకుసాగారు. తెరాసకు తామే ప్రత్యామ్నాయమనే భావనను ప్రజల్లో పెంచి వారి నమ్మకాన్ని చూరగొన్నారు. దుబ్బాక విజయంతో కమలనాథులు ఇతర పార్టీల నేతలు చేరికలపై దృష్టి సారించనున్నారు. 2023 ఎన్నికల్లో గోల్కొండ ఖిల్లపై కాషాయ జెండా ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక ప్రజలిచ్చిన తీర్పు రాష్ట్రంలో పాలకులకు కనువిప్పు కలిగించాలని రఘనందన్‌రావు పేర్కొన్నారు.

సొంత స్థానంలో తెరాస ఓటమి..

రాష్ట్రం ఏర్పడిన తర్వాత 4 శాసనసభ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఏకంగా మూడు చోట్ల కాంగ్రెస్ సిట్టింగ్‌ స్థానాలను రికార్డు మెజార్టీతో దక్కించుకున్న అధికార పార్టీకి.. దుబ్బాకలో నిరాశే మిగిలింది. కారు జోరుకు కమలనాథులు బ్రేకు వేశారు. కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానాల్లో భారీ ఆధిక్యాలను నమోదు చేసుకున్న గులాబీ పార్టీ.. సొంత స్థానంలో ఓటమిని చవిచూసింది. 2018లో దుబ్బాక నుంచి సోలిపేట రామలింగారెడ్డి 62 వేల 500 భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఆయన మరణంతో జరిగిన ఉపఎన్నికల్లో.. ఫలితం తెరాసకే అనుకూలంగా వస్తుందని ఆ పార్టీ శ్రేణులు భావించాయి. హోరాహోరీగా సాగిన ఓట్ల లెక్కింపులో భాజపా అభ్యర్థి రఘునందన్‌రావును విజయం వరించింది.

కంగుతిన్న కాంగ్రెస్​..

దుబ్బాక ఉపఎన్నిక కాంగ్రెస్‌కు కంగుతినిపించింది. జీహెచ్​ఎంసీ ఎన్నికలకు ముందు ఈ చేదు ఫలితాలు హస్తం నేతలకు మింగుడుపడడం లేదు. దుబ్బాకలో మూడో స్థానానికి పరిమితం కావడమే కాక.. భాజపా విజయం సాధించడం కలవరపరుస్తోంది. ఎలాగైనా గెలవాలని సర్వశక్తులు ఒడ్డినా కనీసం ధరావతు దక్కకపోవడం కాంగ్రెస్‌ నేతలను నిరాశకు గురిచేసింది. రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం తామేనని చెబుతున్న కాంగ్రెస్‌కు భాజపా గెలుపును తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని వారు భావిస్తున్నారు. భాజపా కేంద్రంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందనే చర్చ పార్టీలో మొదలైంది.

ఇదీ చదవండి:అసెంబ్లీలో పేద ప్రజల గొంతుకనవుతా: రఘునందన్​

Last Updated : Nov 11, 2020, 7:11 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details