Boy Died falling A Rock in Siddipet: ఏ తల్లిదండ్రులైనా తమ కుమారుడికి చిన్న దెబ్బ తాకితేనే అల్లాడిపోతుంటారు. వారే తమ సర్వస్వంగా బతికే కన్నవారు.. తమకేమైనా పర్వాలేదు కానీ తమ బిడ్డ సంతోషంగా ఉండాలనుకుంటారు. తాము తిన్నా తినకున్నా.. వారి కడుపు నిండితే చాలనుకుంటారు. అందరిలాగే ఈ తల్లిదండ్రులూ తమ కుమారులను అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. కానీ విధి వారిని చిన్నచూపు చూసింది. ఇద్దరు కుమారుల చిన్ని చిన్ని మాటలు.. ముసిముసి నవ్వులతో మురిసిపోతున్న ఆ కుటుంబంలో ఓ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న బిడ్డకు నెల రోజుల క్రితమే ప్రమాదవశాత్తు గాయం కాగా.. రూ.4 లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయించారు. డబ్బులు పోయినా.. బిడ్డ దక్కాడన్న సంతోషం ఆ తల్లిదండ్రులకు ఎన్నో రోజులు నిలవలేదు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న చిన్న కుమారుడిని.. ఈసారి కోతుల రూపంలో మృత్యువు కబళించింది. ఈ హృదయవిదారక ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూర్‌లో సోమవారం జరిగింది.
సర్పంచి జిల్లెల అశోక్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. కట్కూర్ గ్రామానికి చెందిన దేవునూరి శ్రీకాంత్, రజిత దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారికి స్లాబు గదుల ఇళ్లుతో పాటు రేకులతో కూడిన వంటగది ఉంది. అయితే రెండింటికీ మధ్య గాలి, వెలుతురు కోసం ఉన్న ఖాళీ ప్రదేశంపై తడక పెట్టి, గాలికి ఎగిరిపోకుండా దానిపై ఓ బండ పెట్టారు. ఇదిలా ఉండగా.. నిన్న కోతులు ఆ ఖాళీ ప్రదేశం నుంచి శ్రీకాంత్ ఇంటి లోపలికి ప్రవేశించాయి. అది గమనించిన రజిత కోతులను బయటకు వెళ్లగొట్టేందుకు వంటింట్లోకి వెళ్లారు.