తెలంగాణ

telangana

By

Published : Nov 12, 2019, 11:11 PM IST

Updated : Nov 12, 2019, 11:27 PM IST

ETV Bharat / state

యువకుల కుటుంబాలను ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ

వాళ్లంతా 18 నుంచి 22 ఏళ్ల వయసు కుర్రాళ్లు. ఆరేడేళ్లుగా ఎండిపోయిన వాగులో పరవళ్లు తొక్కుతున్న నీటిని చూసి సంబురపడ్డారు. కానీ వారి ఆనందాన్ని తీరని విషాదంగా మార్చింది ఆ వాగు. పండగ సందర్భంగా పుణ్యస్నానం చేసొద్దామని వెళ్లిన ఆ యువకులను వాగులో దాగున్న రాకాసి గుంత మింగేసింది. కార్తికపౌర్ణమి వేళ ముగ్గరు యువకుల తల్లిదండ్రుల జీవితాల్లో అమావాస్య నిండింది.

పుణ్య స్నానాలకు వెళ్లి... అనంతలోకాలకు...

కార్తిక పౌర్ణమి వేళ సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరికోలు గ్రామంలోని మూడు కుటుంబాల్లో తీరని విషాదం నిండింది. 18 నుంచి 22 ఏళ్ల వయసున్న స్నేహితులు పండుగపూట కలుసుకున్నారు. ఊళ్లో ఆరేడేళ్లుగా చుక్క కూడా లేని మోయతుమ్మెద వాగు నీటితో నిండుగా కన్పించగా... పుణ్యస్నానాలు చేసొద్దామని నిశ్చయించుకున్నారు. ఎంతో సంబురంగా... ఒకరినొకరు జంటలు పట్టుకుని నడుస్తూ వాగులో నడుస్తూ వెళ్లారు. కానీ ఆ వాగులో పెద్ద గుంత ఉందని గుర్తించలేకపోయారు. ఆ రాకాసి గుంతలో ఒకరొకరుగా నలుగురు పడిపోయారు. అప్రమత్తమైన మిగతా మిత్రులు జాగ్రత్తపడ్డారు. మునిగిపోయిన వారిని కాపాడేందుకు ప్రయత్నించగా... ఒక్క స్నేహితున్ని మాత్రమే కాపాడుకోగలిగారు.

అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు వెళ్లారు

స్నానానికి వెళ్లిన కుర్రాళ్లు ఎంతసేపటికీ రాకపోయేసరికి అనుమానమొచ్చిన కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగువాళ్లు వెళ్లి చూడగా అసలు విషయం బయటపడింది. వాగులో వెతకగా... విగతజీవులుగా మారిన నిఖిల్​, కూన ప్రశాంత్​, వరప్రసాద్​ మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ముగ్గురు యువకులు... వారి తల్లిదండ్రులకు ఒక్కొక్క కొడుకే కావటం వల్ల రోదనలు మిన్నంటాయి.

ఇసుక మాఫియా వల్లే ఈ ఘటనలు

కొన్నేళ్లుగా వాగులో నీరు లేకపోవటం వల్ల అక్రమార్కులు ఇసుక మాఫియా సాగించారు. వాగులో పెద్ద గుంత తవ్వి ఇసుకను తరలించి సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు ఆ గుంతే... యువకుల పాలిట యమకూపంగా మారిందని గ్రామస్థులు ఆరోపించారు. కుర్రాళ్లకు ఈత రాకపోవడం కూడా మరో కారణంగా స్థానికులు తెలిపారు.
విషయం తెలుసుకున్న హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి యువకుల తల్లిదండ్రులను పరామర్శించేందుకు వచ్చారు. కానీ ఎమ్మెల్యే సతీష్ కుమార్​ను గ్రామస్థులు అడ్డుకున్నారు. ప్రజాప్రతినిధుల అండదండల వల్లే అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని... ఈ ముగ్గురు యువకులు కూడా అందుకే చనిపోయారని ఆరోపించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

బాధితు కుటుంబాలకు సాయం చేస్తాం...

కలెక్టర్​తో, ప్రభుత్వ అధికారులతో ఈ విషయం గురించి చర్చించి సమస్య పరిష్కరిస్తానని ఎమ్మెల్యే సతీష్ కుమార్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్​తో మాట్లాడి బాధిత కుటుంబాలకు సాయం అందేలా చేస్తానన్నారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. పండగ వేళ ముగ్గురు యువకులు చనిపోవడం వారి కుటుంబాల్లోనే కాక గ్రామంలో విషాదం నింపింది.

యువకుల కుటుంబాలను ఆదుకుంటామని ఎమ్మెల్యే హామి

ఇవీ చూడండి: హైకోర్టు సూచించిన కమిటీపై సీఎం కేసీఆర్ సమీక్ష

Last Updated : Nov 12, 2019, 11:27 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details