తెలంగాణ

telangana

ETV Bharat / state

నిత్యం నీటి కష్టాలు... ఉండవా పరిష్కారాలు - బిందె నీటి కోసం రోజుల కొద్దీ ఎదురు చూపు

వర్షాకాలం వచ్చినా తాగునీటి కష్టాలు కొలిక్కి రాలేదు. బిందె నీటి కోసం పడిగాపుల దృశ్యాలు ఇంకా దర్శనమిస్తూనే ఉన్నాయి. అడుగంటిన భూగర్భ జలాలు.. మైదానాన్ని తలపిస్తున్న నదులకు తోడు అధికారుల నిర్లక్ష్యం నీటి కష్టాలను రెట్టింపు చేశాయి. ​సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ మున్సిపాలిటీలో బిందె నీటి కోసం గడియలకొద్దీ వేచిచూడాల్సిన దుస్థితి. నీళ్లో రామచంద్ర అన్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు.

నిత్యం నీటి కష్టాలు... ఉండవా పరిష్కారాలు

By

Published : Jul 26, 2019, 10:52 PM IST

నేటి రోజుల్లో ఎవరి నోట విన్నా జలం మూలం ఇదం జగత్ అనే వినిపిస్తోంది. ఖాళీ బిందెల బారులు.. నాలుగు రోజులకోసారి వచ్చే వంతు.. అప్పుడైనా దొరికేవి నాలుగైదు బిందెలు.. వారానికోసారి స్నానం. ఇదేదో మారుమూల ఊళ్లో కాదు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ వాసుల దుస్థితి. తీవ్ర వర్షాభావ పరిస్థితులు.. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడం వల్ల కాలనీ వాసుల నీటి కష్టాలు వర్ణణాతీతం.

బిందె నీటి కోసం రోజుల కొద్దీ ఎదురు చూపు

కాలనీలో ఉన్న ఒక్క బోరు నుంచి మాత్రమే నీరు వస్తోంది. దీనికోసం వంతులు వేసుకుని మరీ బిందెలతో రేయింబవళ్లు పడిగాపులు కాస్తున్న పరిస్థితి. నీటి కష్టాలను గురించి అధికారులకు, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారి వేధన అరణ్య రోదణగానే మిగిలింది. పలుకుబడి ఉన్న నేతల కాలనీలకు మాత్రమే నీళ్లిస్తున్నారని తమను ఎవ్వరూ పట్టించుకోవడం లేదంటూ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బోరుమీదే ఆధారపడి 1500 మంది కాలం వెళ్లదీస్తున్నామన్నారు. నాలుగు రోజులకోసారొచ్చే నంబరు కోసం పిల్లల్ని బడి మాన్పించి మరీ నీటికోసం క్యూలైన్లో కూర్చోబెడుతున్న పరిస్థితి ఉందన్నారు. పడుకోకుండా... వండుకోకుండా నీటి కోసమే పడిగాపులు కాస్తున్నామని చెబుతున్నారు.

అధికారులేమంటున్నారు

భూగర్భ జలాలు అడుగంటిపోవడం వల్ల అన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయిలో నీటి సరఫరా సాధ్యం కావడం లేదని అధికారులు చెబుతున్నారు. సాధ్యమైనంత త్వరలో సమస్య పరిష్కరిస్తామంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు వేడుకుంటున్నారు.

నిత్యం నీటి కష్టాలు... ఉండవా పరిష్కారాలు
ఇదీ చూడండి: మురుగు నీటితో... వ్యవసాయం

ABOUT THE AUTHOR

...view details