తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా వేళ వందల మందితో జన సమీకరణ ఎలా చేస్తారు: హైకోర్టు

జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి.. నిమ్జ్ ఏర్పాటుపై జరగాల్సిన ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా పడింది. కరోనా దృష్ట్యా.. శుక్రవారం జరిగే ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 31 వరకు భారీ జన సమీకరణ ఉండరాదన్న కేంద్రం .. ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించరాదని స్పష్టం చేసింది. పరిస్థితులు చక్కబడిన తర్వాతే... నిర్వహించుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.

Referendum on Nimz formation postponed by highcourt
నిమ్జ్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా

By

Published : Jul 9, 2020, 7:15 PM IST

Updated : Jul 10, 2020, 7:00 AM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో 12, 635 ఎకరాల్లో.. సుమారు 4వేల కోట్లతో నిమ్జ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా.. సంగారెడ్డిలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు.. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాట్లు చేసింది.

కరోనా నేపథ్యంలో.. ప్రజాభిప్రాయ సేకరణ నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ... నాయల్కల్ మండలంలోని మామిడ్జి గ్రామానికి చెందిన ఐదుగురు రైతులు... హైకోర్టును ఆశ్రయించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్​ఎస్​ చౌహాన్, జస్టిస్ విజయ సేన్‌రెడ్డి ధర్మాసనం... వారి పిటిషన్‌పై విచారణ జరిపింది.

ప్రభుత్వ వివరణ ఇలా..

ప్రతిష్ఠాత్మక నిమ్జ్ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రానున్నాయని... ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్​ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. ప్రక్రియ నిలిచిపోతే ప్రాజెక్టు ఇతర రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

చైనాలో కరోనా పరిస్థితుల కారణంగా అక్కడి నుంచి రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అన్నారు. కాబట్టి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఏజీ వాదించారు. కరోనా పరిస్థితుల్లోనూ మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాలు ఇప్పటికే చాలా ముందుకు వెళ్లాయని వివరించారు.

ఎలా అనుమతిస్తారు..?

రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతుండగా సుమారు 1200 మందితో జన సమీకరణకు ఎలా అనుమతిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఈనెల 31 వరకు ఎలాంటి జనసమీకరణ ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలు కూడా ఉందని ధర్మాసనం పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించదానికి వీల్లేదని స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో జన సమీకరణకు అనుమతించి.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనలో భాగస్వామ్యం కాలేమని వ్యాఖ్యానించింది. కాబట్టి ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేసి.. పరిస్థితులు చక్కబడిన తర్వాత నిర్వహించుకోవాలని ఆదేశించింది.

ఇవీ చూడండి: కరోనాపై ఇంటి నుంచే యుద్ధం.. హోం ఐసోలేషన్‌లోనే వైద్య సేవలు..

Last Updated : Jul 10, 2020, 7:00 AM IST

ABOUT THE AUTHOR

...view details