తెలంగాణ

telangana

ETV Bharat / state

పాత పంటల మహోత్సవం.. నేటి నుంచి 30 రోజుల పాటు జాతర!

నేటితరం మరిచిపోతున్న చిరుధాన్యాలను ప్రజలకు పరిచయం చేయటమే లక్ష్యంగా డెక్కన్​ డెవలప్​మెంట్​ సొసైటీ నిర్వహించే పాత పంటల జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. నెల రోజుల పాటు ఈ జాతర జరగనుంది. సంగారెడ్డి జిల్లా న్యాల్​కల్​ మండలం షంషేల్లపూర్​ నుంచి ఈ ఊరేగింపు ఉత్సవాన్ని ప్రారంభించారు.

paatha pantala jathara, millets festivities
పాత పంటల జాతర

By

Published : Jan 14, 2021, 7:27 PM IST

ప్రోత్సాహకం అందజేస్తున్న రుక్మిణి రావు

'జీవ వైవిధ్యమే దేవాలయం.. విత్తనాలే దేవుళ్లు'గా కొలిచే డెక్కన్ డెవలప్​మెంట్ సొసైటీ(డీడీఎస్) ఆధ్వర్యంలో పాత పంటల జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లా న్యాల్​కల్ మండలం షంషేల్లపూర్​లో జాతరలో భాగంగా.. బండ్ల ఊరేగింపు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నేషనల్ హెల్త్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ మేనేజ్​మెంట్​ ప్రతినిధి డాక్టర్ ఆర్​.పి. చంద్ర శేఖర, గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్ ప్రతినిధి డాక్టర్ రుక్మిణి రావు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి జాతరను ప్రారంభించి.. ఎడ్ల బండ్ల ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు.

చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచడం లక్ష్యంగా నెల రోజుల పాటు జరిగే ఈ జాతరను జిల్లాలో ఒక్కోరోజు ఒక్కో గ్రామంలో నిర్వహిస్తారు. ధాన్యాలను రైతులు తమ ఎడ్ల బండ్లకు అలంకరించారు. వంద రకాల ధాన్యాలతో ఊరేగింపు చేపట్టారు. ఆహారధాన్యాలను దేవుళ్లుగా కొలిచే ఈ విధానం పర్యటకులను ఆకర్షిస్తోంది.

ఆధునిక యుగంలో పాత పంటలను పూర్తిగా మర్చిపోతున్నాం. జహీరాబాద్​లో ఈ రకమైన పంటలను పండించేందుకు డీడీఎస్ సంస్థ.. మహిళా రైతులను తయారుచేసి దేశానికి ఆదర్శంగా నిలిపింది. చిరుధాన్యాలను ఆహారంలో భాగంగా తీసుకుంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. వీటిపై అందరూ దృష్టి సారించాలి.

డాక్టర్ ఆర్​.పి. చంద్ర శేఖర, నేషనల్ హెల్త్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ మేనేజ్​మెంట్​ ప్రతినిధి

ఇదీ చదవండి:సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని ఇంట్లో బొమ్మల కొలువు.!

ABOUT THE AUTHOR

...view details