సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో నాలుగు ప్రభుత్వ ఐటీఐలు ఉన్నాయి. సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐలోనే జహీరాబాద్‌కు చెందిన ఐటీఐని కూడా కొనసాగిస్తున్నారు. హత్నూర, పటాన్‌చెరులోనూ ఒకటి చొప్పున ఐటీఐ కళాశాలలు ఉన్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో తరగతులు నిలిచిపోగా... కొన్ని రోజులుగా ఆయా కళాశాలల్లో ఆన్‌లైన్ బోధనకు అధ్యాపకులు శ్రీకారం చుట్టారు. సమాచార, సాంకేతిక వ్యవస్థను ఉపయోగించుకుని విద్యార్థులకు అర్థమయ్యేలా బోధిస్తున్నారు. జిల్లాలో 14 ప్రైవేటు ఐటీఐలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో వీటిలోనూ ఆన్‌లైన్ పాఠాలు బోధించడానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
సందేహాలు నివృత్తి చేస్తూ...
ప్రస్తుతం ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులు ప్రాముఖ్యత లేని సందేశాలకు దూరంగా ఉంటూ... శ్రద్ధగా ఆన్‌లైన్ పాఠాలు వింటున్నారు. అధ్యాపకుల సూచనల మేరకు సబ్జెకులపై పట్టు సాధించడానికి నిత్యం ఇంట్లోనే ఉంటూ సాంకేతికత సాయంతో కృషి చేస్తున్నారు. అధ్యాపకులు రూపొందించిన పాఠ్యాంశాలను దృశ్య రూపంలో విద్యార్థులకు వాట్సాప్ ద్వారా చేరవేస్తున్నారు. విద్యార్థులకు ముఖ్యమైన పాఠ్యాంశాలను పీడీఎఫ్ రూపంలో కూడా అందుబాటులో ఉంచుతున్నారు. వీడియో కాలింగ్ ద్వారా సందేహాలను నివృత్తి చేస్తున్నారు.