తెలంగాణ

telangana

ETV Bharat / state

'నేను మీ హరీశ్‌ రావుని మాట్లాడుతున్నా.. ఆరోగ్యం ఎలా ఉంది'

నేను మీ హరీశ్ రావు, మంత్రిని మాట్లాడుతున్నాను. ఆరోగ్యం ఎలా ఉంది. మా వాళ్లు ఫోన్ చేస్తున్నారా.. రోజుకు ఎన్ని సార్లు చేస్తున్నారు.. మందులు ఇచ్చారా అంటూ.. కరోనా బాధితులకు మంత్రి హరీశ్ రావు ఫోన్ చేసి వాకబు చేశారు. సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

harish rao
harish rao

By

Published : Jul 5, 2020, 12:21 PM IST

సంగారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో ఆర్థిక మంత్రి హరీశ్ రావు శనివారం పర్యటించారు. వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జోగిపేట నుంచి సంగారెడ్డికి వస్తున్న మంత్రి హరీశ్ రావు.. చౌటకూర్ వద్ద రోడ్డు పక్కన పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న వారిని చూసి ఆగారు. వారి వద్దకు వెళ్లి.. రైతులు, కూలీలతో మాట కలిపారు.

ఏ పంటలు వేశారు

భూమి ఎంత ఉంది.. రైతుబంధు డబ్బులు వచ్చాయా.. ఏఏ పంటలు వేశారు.. ఎరువులు, విత్తనాలకు ఏమైనా ఇబ్బంది కలిగిందా అంటూ రైతును వివరాలు అడిగి తెలుసుకున్నారు. కూలీకి వచ్చిన వారితోనూ మంత్రి మాట కలిపారు. తాము హైదరాబాద్‌లో పనులు చేసే వాళ్లమని.. కరోనా వల్ల పనులు లేక సొంత గ్రామానికి వచ్చామని కూలీలు మంత్రికి వివరించారు. హైదరాబాద్‌లో ఏం పని చేసే వారు.. అక్కడ ఎంత సంపాందించే వారు.. ఇక్కడ ఎంత వస్తోంది అని వారిని మంత్రి అడిగారు. పట్నంలో కంటే ఇక్కడే ఎక్కువ వస్తున్నా.. ఈ పని కష్టంగా ఉందని కూలీలు వివరించారు. ఉపాధి హమీ పనికి వెళ్తే రోజు మరో రెండు వందల రూపాయలు అదనంగా వస్తాయని వారికి మంత్రి సూచించారు. ఉన్న ఉర్లోనే ఉండి పనులు చేసుకోవాలని వివరించారు.

ఆరోగ్యం ఎలా ఉంది

జిల్లాలో కరోనా ప్రభావంపై వైద్యారోగ్య శాఖ అధికారులతో కలెక్టరేట్‌లో మంత్రి హరీశ్‌ రావు సమీక్ష నిర్వహించారు. ఒక్కో రోగి వారీగా అందిస్తున్న వైద్యం, ఆరోగ్య స్థితి వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా బాధితులకు ఫోన్ చేసి.. 'ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉంది.. మీ ఇంట్లో వాళ్ల పరిస్థితి ఎలా ఉంది.. అందుతున్న ఆరోగ్య సహయం' వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా నివారణకు, కుటుంబ సభ్యులకు విస్తరించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి మంత్రి వివరించారు.

జిల్లాలో వైకుంఠధామాలు, డంప్ యార్టులు, రైతు వేదికల నిర్మాణంపై అధికారులు, సర్పంచులతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఇదీ చదవండి:రణమున గెలిచారు: కరోనాను జయించిన వారి అనుభవాలివి!

ABOUT THE AUTHOR

...view details