Farmers dharna in Sangareddy district: వ్యవసాయ బావులకు కరెంట్ బిల్ ఉచితమే అయినా ప్రతీ మోటార్‌కు సర్వీస్ ఛార్జ్ కింద నెలకు రూ.30 కట్టాల్సి ఉంటుంది. మెదక్ జిల్లా రామాయంపేట పరిధిలో ఈ బకాయిలో లక్షల్లో పేరుకు పోయింది. రైతులు సుమారు సంవత్సరం నుంచి ఈ బిల్లులు కట్టడం లేదు. ఇటీవల బకాయిల వసూలు చేపట్టిన అధికారులు.. బిల్లులు కట్టని రైతుల మోటార్లకు కరెంట్ కట్ చేశారు.
అధికారుల తీరును నిరసిస్తూ రైతులు స్థానిక సబ్ స్టేషన్ దగ్గర ఆందోళనకు దిగారు. వారం రోజులుగా కరెంట్ లేక వరి నారు మడులు ఎండి పోయాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బావులకు వెంటనే కరెంట్ సప్లయ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఏఈ పెంట్యా నాయక్ అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న కరెంట్ బిల్లులు కట్టాలని ఆయన సూచించారు. అప్పుడే కరెంట్ ఇస్తామని చెప్పడంతో బిల్లులు కట్టని వారితో పాటు కట్టిన వారి బావులకు కూడా ఎలా కట్ చేస్తారని వారు ప్రశ్నించారు. బిల్లు కట్టని వారికే సప్లయ్ నిలిపి వేసేందుకు అధికారులు అంగీకరించడంతో ఆందోళన విరమించారు.