Drinking Water Problem in Sangareddy: తలాపున గోదారి పారినా మన చేను, చెలకలు ఎండినా దైన్యాన్ని స్వరాష్ట్ర ఉద్యమం నిలదీసింది. అచ్చం, అలాంటి ఇబ్బందే ఇప్పుడు మరో మూడు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ మహా నగరానికి తాగునీరందించే మంజీరా.. ఆ పంచాయతీ పరిధిలోనే ఉన్నా గుక్కెడు మంచినీళ్లు వారికి అందని ద్రాక్షగా మారాయి. మిషన్ భగీరథ ద్వారా వస్తున్న అపరిశుభ్ర నీళ్లు తాగి రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంజీరా ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించి భూములు కోల్పోయిన తమకు తాగునీటి సమస్య తీర్చాలంటున్న బాధితులపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
Drinking Water problems Manjira Project Villages : సంగారెడ్డి జిల్లాలోని కల్పూరులో మంజీరా ప్రాజెక్టు ఉంది. కానీ, అదే పంచాయతీతో పాటు అంగడిపేట్, గంజిగూడ గ్రామాలకు మాత్రం తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు దొరకట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతం నుంచే హైదరాబాద్, సంగారెడ్డి వంటి ప్రధాన పట్టణాలకు తాగునీరు సరఫరా అవుతోందని వెల్లడిస్తున్నారు. మిషన్ భగీరథ(Mission Bhagiratha) ద్వారా వచ్చే నీళ్లలో బురదతో పాటు తోకపురుగులు వస్తున్నాయని వాపోతున్నారు. మంజీరా ప్రాజెక్టు నిర్మాణానికి సహకారంతో పాటు భూములు ఇచ్చినా.. నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు వాతావరణ ప్రభావంతో విషజ్వరాలు విజృంభిస్తుండగా మరోవైపు కలుషిత నీటితో వచ్చే జబ్బులతో ఆస్పత్రి ఖర్చులు భారమౌతున్నాయని ఆవేదన వెలిబుచ్చుతున్నారు.
"ఐదు రోజుల నుంచి మురికి నీరు వస్తోంది. మా గ్రామం దగ్గరల్లోనే మంజీర డ్యామ్ ఉంది. నిర్మాణానికి మేము కష్టపడ్డాం. మా భూములు ఇచ్చాం. ఇక్కడ నుంచి ఎక్కడికో మంచి నీళ్లు తీసుకువెళ్తున్నారు. మాకు మాత్రం మంచి నీళ్లు రాలేదు. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నా అవి మురికిగా ఉంటున్నాయి. వాటిని తాగితే అనారోగ్యం వస్తుందేమో భయంగా ఉంది. నీళ్లు కొనుక్కునే స్థోమత మాకు లేదు." - స్థానిక మహిళ