Deccan Development Society Biodiversity Festival 2024 : జహీరాబాద్ మండలం పస్తాపూర్‌లో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో 1999లో ఆ సంస్థ డైరెక్టర్ దివంగత పీవీ సతీశ్(DDS Sathish) జీవవైవిద్య సంరక్షణలో భాగంగా విత్తనాల ప్రదర్శన, ఆయుర్వేద మందుల వినియోగంపై తొలిసారిగా జాతర ప్రారంభించారు. అనంతరం చిరుధాన్యాల ప్రాధాన్యత వివరిస్తూ భారత్‌తో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ సహా పాకిస్తాన్‌లో జీవవైవిద్య జాతరలు నిర్వహించారు.
చిరుధాన్యాల ఉత్పత్తి కోసం ఆహార సార్వభౌమత్వం కార్యక్రమం - ప్రభుత్వానికి 10 డిమాండ్లతో తీర్మానం
DDS Patha Pantala Jathara :డీడీఎస్ ఆధ్వర్యంలో 2001 నుంచి జహీరాబాద్ డివిజన్‌లోని పలు మండలాల్లో ఎద్దుల బండ్లపై విత్తనాలు ఊరేగిస్తూ నెల రోజులు చిరుధాన్యాల జాతరను నిర్వహించడం ప్రారంభించారు. మొగుడంపల్లి మండలం జాడిమల్కాపూర్‌లో ఈనెల14న మొదలైన పాతపంటల జాతర(PathaPantala Jathara) ఫిబ్రవరి 12వ తేదీ వరకు 23 గ్రామాల మీదుగా సాగనుంది. పాతపంటల ప్రదర్శనతో పాటు గ్రామీణ ప్రజల ఆహార అలవాట్లు, ఆరోగ్యంలో చిరుధాన్యాల పాత్ర, సాగు ప్రాముఖ్యతపై గ్రామసభలు నిర్వహించనున్నారు.
మొగుడంపల్లి, జహీరాబాద్, న్యాల్‌కల్, ఝరాసంగంలో జాతర ప్రదర్శన నిర్వహించి ఫిబ్రవరి 23న మాచునూర్‌లో ముగింపు సభ జరగనుంది. పాతపంటల జాతర ద్వారా ప్రజలకు చిరుధాన్యాల ప్రాముఖ్యత వివరిస్తున్నారని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాతపంటల జాతరలో భాగంగా జహీరాబాద్ డీడీఎస్ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నేలలు, సేంద్రీయ ఎరువులు, సుస్థిరసాగుపై ఏర్పాటుచేసిన ప్రదర్శన ఆకట్టుకుంది.