భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర సోమవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లాకు చేరుకుంది. జిల్లా పొలిమేరలో పార్టీ శ్రేణులు డప్పు చప్పుళ్లతో, బోనాలతో, బతుకమ్మలతో, నృత్యాలు చేస్తూ ఘనస్వాగతం పలికారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను గద్దె దించి భాజపా జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్. కోట్లు వచ్చే భూములను కంపెనీలకు అప్పగించి ఉద్యోగాలు వస్తాయని తెరాస నేతలు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. 95 శాతం మందికి ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధపు మాటలు చెప్పడం న్యాయమా అని ప్రశ్నించారు. 2023లో భాజపా జెండా ఎగురవేసి చార్మినార్ దగ్గర బహిరంగ సభ ఏర్పాటు చేయడం ఖాయమన్నారు.
దుబ్బాకలో కేసీఆర్ మెడలు వంచామని.. వచ్చే హుజురాబాద్ ఎన్నికల్లో తెరాసను తుంగలో తొక్కడం ఖాయమని అన్నారు బండి సంజయ్. ఎండను, వానని లెక్క చేయకుండా 10వ రోజు యాత్ర చేస్తున్నాం అంటే ప్రజల ఆశీస్సులు తమకు ఏవిధంగా ఉన్నాయో గ్రహించాలని అన్నారు. డబుల్ బెడ్రూం ఇల్లు, నిరుద్యోగ భృతి ఏమయ్యాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణలో నిరుద్యోగులు లేకుండా చేస్తానన్న కేసీఆర్ మాటలు ఇప్పుడు ఏమయ్యాయని మండిపడ్డారు.