రాష్ట్రంలోని ఉపసర్పంచ్‌లకు గౌరవ వేతనం ఇవ్వాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాములు నాయక్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఎల్బీనగర్లోని ఓ కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. తమను ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఉన్న ఉపసర్పంచ్‌ల సమస్యలను ప్రభుత్వం వెంటనే తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కేవలం పేరుకే మాత్రమే ఉపసర్పంచ్‌లకు చెక్ పవర్ ఉందన్నారు. చెక్ సంతకాలు పెట్టిన, పెట్టకపోయిన కలెక్టర్లు సస్పెండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తమ అవార్డ్ అందుకున్న ఉపసర్పంచ్‌లను కూడా అవిశ్వాస తీర్మానం పేరుతో సస్పెండ్ చేస్తున్నారని ఆరోపించారు.
గ్రామ పంచాయతీ నిధుల తీర్మానంపై ఉపసర్పంచ్‌ల సంతకం ఉండాలని ఆయన కోరారు. సర్పంచ్‌లకు ఇచ్చిన మాదిరిగా మాకు కూడా కనీసం గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో సెక్రెటరీ, మహిళ సర్పంచ్ భర్తల పెత్తనం నడుస్తోందని వాటిని నియంత్రించాలన్నారు. కొన్ని జిల్లాలో గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో శిలాఫలకాల్లో ఉపసర్పంచ్‌ల పేర్లు కూడా ఉండాలన్నారు. జనరల్ బాడీ మీటింగ్‌లో తమను కూడా ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు.
ఉపసర్పంచ్‌ల తగిన ప్రాధాన్యత ఇచ్చి తమని కూడా గౌరవించాలని కోరారు. రాష్ట్రంలో సర్పంచ్ల దగ్గర కానీ, సెక్రెటరీల దగ్గర కానీ ఉపసర్పంచ్లు ఒక్కరు కూడా కమిషన్లు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. మాకు సరైన గౌరవం దక్కేవరకు మా పోరాటం ఆగదని ఆయన వెల్లడించారు. ఈ విషయంలో త్వరలో కేటీఆర్‌ను కలవడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులపై అనర్హత వేటు తీసేసి అవిశ్వాస తీర్మానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దీనిపై స్టే కోసం హైకోర్టుకి కూడా వెళ్తామన్నారు.
రాష్ట్రంలో ఉపసర్పంచ్‌లకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలి. ఉప సర్పంచుల పేరు శిలాఫలకాలపై ఉండాలి. గ్రామ పంచాయతీలో ఉపసర్పంచ్‌లందరికీ అవగాహనా సదస్సు పెట్టాలి. మండల ఆఫీసుల్లో జరిగే సర్వసభ్య సమావేశాలకు ఆహ్వానించాలి. రెండున్నర ఏళ్లుగా ఇప్పటి వరకు అవగాహన సదస్సు పెట్టలేదు. రాష్ట్రంలో ఉపసర్పంచ్‌లను ఉద్దేశ పూర్వకంగా సస్పెండ్ చేస్తున్నారు. చెక్ పవర్‌పై సంతకాలు పెట్టడం లేదని వేధిస్తున్నారు. మాపై అవిశ్వాస తీర్మానం కూడా పెడుతున్నారు. దీనిపై తాము స్టే తెచ్చుకునేందురు హైకోర్టుకు వెళ్తాం. మా డిమాండ్లను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తాం.
-రాములు నాయక్, ఉపసర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చూడండి: