Amithsha tour: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటితో ముగియనుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో రెండో విడత పాద యాత్రను బండి సంజయ్ ముగింపు పలకనున్నారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్‌లో రెండో విడత పాదయాత్రను బండి సంజయ్ ప్రారంభించారు. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో 31 రోజుల పాటు సుమారు 400 కిలోమీటర్లకు పైగా బండి సంజయ్ నడిచారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంటూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖలు సంధిస్తూ ముందుకు సాగారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ వేదికగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వరంగల్‌లో కాంగ్రెస్ నిర్వహించిన రైతు సంఘర్షణ సభకు ధీటుగా అమిత్ షా సభకు కమలనాథులు ప్రణాళికలు వేశారు. రాష్ర్ట భాజపా శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపేంలా అమిత్ షా సభ ఉంటోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి జనసమీకరణ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి నియోజకవర్గం నుంచి 5 వేల మందిని సభకు తీసుకువచ్చేలా జిల్లా అధ్యక్షులకు ఆదేశించారు. రైతులు, మహిళలు, యువత సహా.. అమిత్ షా సభకు 5లక్షల మందిని తరలించాలని పార్టీ నిర్ణయించింది.
అమిత్ షా సభకు భారీగా జనసమీకరణ చేస్తున్న భాజపా జీహెచ్ఎంసీ పరిధిలోని కార్పొరేటర్లకు సైతం జనసమీకరణ కోసం లక్ష్యం విధించింది. వరంగల్ వేదికగా రైతు సంఘర్షణ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇటీవల భారీ బహిరంగ సభ నిర్వహించింది. తాము అధికారంలోకి వస్తే రైతులకు ఏమి చేస్తామనే దానిపై కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ ప్రజల్లోకి వెళ్లక ముందే.. దాన్ని తిప్పికొట్టాలని భాజపా యోచిస్తోంది. తుక్కుగూడ బహిరంగ సభా వేదికగా అమిత్ షా తెరాస సర్కార్‌పై తీవ్ర విమర్శనాస్ర్తాలు ఎక్కుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటల బహిరంగ సభ ఏర్పాట్లు.. అమిత్ షా పర్యటన సందర్భంగా ఇదే సంకేతాన్ని ఇచ్చారు. పాదయాత్ర ముగింపు సభను ఘనంగా నిర్వహించాలని... బండి సంజయ్ పట్టుదలతో ఉన్నారు. అమిత్ షా సభతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం వస్తోందని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.