Statue Of Equality : సుగంధ పరిమళాలు వెదజల్లే పూలు.. చల్లని చిరుగాలిని మోసుకువచ్చే మొక్కలు.. ఆధ్యాత్మికను పంచే ఆకృతులతో తీర్చిదిద్దిన పొదలు.. ఇలా ఒకటేమిటి ప్రతిదీ అక్కడ ప్రత్యేకమే.! సమతాస్ఫూర్తి కేంద్రం సమానత్వానికి ప్రతీక మాత్రమే కాదు.. ఆహ్లాదభరిత వాతావరణానికి వేదికగా మారనుంది. హరితహారంలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసే మొక్కలతో నిత్యం పచ్చదనంతో అలరారనుంది. 45 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు సగం నిర్మాణాలకు పోగా.. మిగిలిన ఖాళీ ప్రదేశంలో పచ్చదనాన్ని ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ ప్రదేశం మొదలుకుని ప్రవేశద్వారం వద్ద, దివ్య దేశాల మహామండపం ఎదురుగా, భద్రవేదిక చుట్టుపక్కల.. ఇలా ప్రతీచోట మొక్కలు పెంచుతున్నారు. చిన్నజీయర్‌స్వామి పర్యవేక్షణలో ఆధ్యాత్మికతను చాటేవే కాకుండా సంప్రదాయ మొక్కలను ఏర్పాటు చేస్తున్నారు.
సంప్రదాయ రకాలు సైతం..
Ramanuja Statue in Muchintal :రామానుజాచార్యుల మూర్తి ప్రకృతిలో మమేకమై ఉంటుంది. పూల మొక్కలే కాకుండా ల్యాండ్‌స్కేపింగ్‌కు వీలుగా తయారు చేస్తున్నారు. గులాబీలు, మల్లె, బంతి, చామంతి, సంపంగి, పసుపు సంపంగి, కనకాంబరాలు, కశ్మీరీ రోజాలు, పొగడపూలు, మందార, మద్రాసు కనకాంబరం.. ఇలా వందకుపైగా రకాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2 లక్షల మొక్కలతో ముస్తాబు చేస్తున్నారు. మొక్కలను కడియం, రాజమహేంద్రవరంతోపాటు హైదరాబాద్ నర్సరీల నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. వందలాది కార్మికులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఈ మొక్కలు పుష్పిస్తే సమతామూర్తి కేంద్రం మరింత శోభను సంతరించుకోనుంది.