ప్రస్తుతం ఇళ్లల్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడం వల్ల భార్యభర్తల మధ్య గొడవలు తలెత్తుతున్నాయి. అవి మహిళలపై గృహహింసకు దారి తీస్తున్నట్లు పోలీసుల దృష్టికొచ్చింది. ఈ నేపథ్యంలో డయల్ 100, వాట్సాప్(94906 17111), ఫేస్‌బుక్, ట్విటర్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేయడంపై అవగాహన కల్పించాలంటూ కమిషనర్ మహేశ్ భగవత్ ఆదేశించారు. వెంటనే షీ బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌లో పలు చోట్ల ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి బాధితులతో పాటు ఆమె కుటుంబసభ్యులకు నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు.
ఆపత్కాలంలో 'ఆమె'కు అండగా షీటీం బృందాలు
లాక్ డౌన్‌లో తమకు ఎదురవుతున్న గృహ హింస, ఇతర ఇబ్బందులపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు అవకాశం లేకపోవడంతో చాలా మంది మహిళలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వారికి అండగా నిలిచేందుకు రాచకొండ పోలీసులు షీ బృందాలను రంగంలోకి దింపారు.
మహిళలకు అండగా రాచకొండ పోలీసులు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఫోన్ చేస్తే.. ప్రముఖ మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ ఇచ్చే ఏర్పాట్లు చేశారు. ఈ కౌన్సెలింగ్ చాలా మంది మహిళల ప్రాణాలను నిలబెడుతోంది. ‘మహిళలు తమకు ఎలాంటి సమస్యలున్నా రాచకొండ కంట్రోల్ రూం (94906 17234) లేదా 040- 48214800 నంబర్‌కు ఫోను చేయవచ్చు. ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు మానసిక నిపుణులు అందుబాటులో ఉంటారు’ అని సీపీ మహేశ్ భగవత్ ‘ఈనాడు’కు వివరించారు.
ఇదీ చూడండి:సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వం విముఖత!