Heavy Rains in Telangana: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు గాలి వాన బీభత్సం సృష్టించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉప్పెనలా విరుచుకుపడిన వాన.. అన్నదాతలను ఆగమాగం చేసింది. పలు జిల్లాల్లో కోత దశలో ఉన్న వరి చేలు.. గాలివానకు నేలకొరిగి నీటమునిగాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. ఆరుగాలం శ్రమించిన రైతుల కష్టం.. వానపాలైంది. అకాల వర్షం కారణంగా హైదరాబాద్ మహానగరం అతలాకుతలమైంది. రహదారులు జలమయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. ఈదురుగాలులకు భారీ చెట్లు సైతం నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. డ్రైనేజీలు పొంగిపొర్లాయి.
మోకాళ్ల లోతు వరద: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో కురిసిన భారీవర్షంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంట పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లపై భారీగా చేరిన వరదనీటితో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పోలీసు కమిషనర్ కార్యాలయ సమీపంలోని హైదర్ గూడ రహదారిపై భారీగా నీరు చేరడంతో... కార్లు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదర్‌గూడ నుంచి బషీర్‌బాగ్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. బషీర్ బాగ్‌లో రహదారిపై చెట్ల కొమ్మలు విరిగిపడటంతో పాటు.. లా కళాశాల ఎదుట రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో బాటసారులు ఇబ్బందులు పడ్డారు. సూరారం ప్రధాన రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది.
జలమయం: సాగర్ రింగ్ రోడ్ కాకతీయ కాలనీలో ఓ స్కూటీ వరదకు కొట్టుకొచ్చింది. మీర్‌పేటలో లెనిన్ నగర్ నీట మునగగా.. ఇళ్లలోకి వర్షపు నీరు రావడంతో స్థానికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఆల్వాల్‌లో కాలనీలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రహదారులపై భారీగా వర్షపు నీరు చేరడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పాతబస్తీలో చార్మినార్, హుస్సేని అలం, షా అలీ బండ ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. భారీ వర్షాల దృష్ట్యా చార్మినార్ జోనల్ కమిషనర్‌తో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు. వర్షాలకు పలు ప్రాంతాలు నీటమునిగినట్లు తెలిపారు. నీటమునిగిన ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టాలని కమిషనర్‌ను కోరారు.
యాదాద్రిపై ఆగమాగం: ఏకధాటి వానకు యాదగిరిగుట్టలో కొండపై క్యూ కాంప్లెక్స్‌లోకి వర్షపు నీరు చేరింది. దిగువ ఘాట్‌రోడ్డు ప్రారంభంలో తారు రోడ్డు కుంగిపోయింది. దీంతో దిగువ ఘాట్‌రోడ్డులో రాకపోకలు నిలిపివేశారు. వర్షం ధాటికి చలువ పందిళ్లు ఊడిపడ్డాయి. కొండపైకి చేరుకునే మొదటి ఘాట్ రోడ్డుపై మట్టిపెళ్లలు కూలిపోయాయి. వర్షానికి కొండ దిగువన కాలనీలోకి మట్టిపెల్లలు జారిపడ్డాయి. సిబ్బంది సహాయంతో వాటిని తొలగించారు. కొండపైకి వెళ్లే ఘాట్‌రోడ్డు మీదుగా రాకపోకలకు అనుమతించారు. వర్షపు నీటితో యాదగిరిగుట్ట బస్టాండ్ ప్రాంగణం నిండిపోయింది. మోత్కూరు మం. దాచారంలో పిడుగుపడి 15 గొర్రెలు మృతి చెందాయి. ఆత్మకూరు మండలం కూరెళ్లలో పిడుగుపడి గేదె మృతి చెందింది. అడ్డగూడూరు మండలం మంగమ్మగూడెంలో పిడుగుపడి తాటిచెట్టు దగ్ధమైంది.
మింగిన పిడుగు:సిద్దిపేట జిల్లా దుబ్బాక, సిద్దిపేట, పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి మోస్తరు వర్షం కురిసింది. వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యం తడిసి ముద్దయింది. అకాల వర్షానికి ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్సింది. దుబ్బాక నియోజకవర్గంలోని నరేండ్లగడ్డ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పపై టార్పాలిన్ కప్పుతుండగా పిడుగుపడి రైతు పోచయ్య(65) మృతి చెందారు. మరో రైతు కొండయ్య విద్యుదాఘాతానికి గురవ్వడంతో దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఎడతెరిపి లేని వర్షం:మరోవైపు నల్గొండ జిల్లావ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. పలు మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మోస్తరు వర్షం కురవగా.. త్రిపురారం, నిడమనూరు, అనుముల, మిర్యాలగూడ, పెద్దవూర, చిట్యాల, భువనగిరి, మోత్కూరులో ఎడతెరిపిలేని వాన కురిసింది. నకిరేకల్ మండలం మోదినిగూడెంలో పిడుగుపడి.. లింగస్వామి(23) మృతి చెందారు. హాలియా మార్కెట్ యార్డులో ధాన్యం తడిసిపోగా.. నిడమనూరు మం. వేంపాడు కొనుగోలు కేంద్రంలో 2 వేల బస్తాల ధాన్యం తడిసిముద్దైంది.
కొట్టుకుపోయిన ధాన్యం:భారీ వర్షానికి పెద్దపల్లి జిల్లాలో మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిపోయింది. మంథని మార్కెట్ యార్డు, పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోగా.. ధాన్యం కుప్పల చుట్టూ చేరిన వర్షపు నీటిని రైతులు తొలగిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి నెల రోజులు దాటినా ఇంతవరకూ కాంటా పెట్టలేదని రైతులు వాపోతున్నారు. సుల్తానాబాద్ మార్కెట్ యార్డులో 20 వేల క్వింటాళ్ల ధాన్యం నీటిపాలైంది. టార్పాలిన్లు అందుబాటులో లేకపోవడంతో.. పెద్దపల్లి మార్కెట్‌లో 500 క్వింటాళ్ల ధాన్యం కొట్టుకుపోయింది.